Monday, November 25, 2024

TG | మ‌రో ఐదు రోజులు భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 31 వరకు ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల చివరి వారంలో తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ నెల 27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.

ఈ నెల 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ నాలుగు రోజులపాటు హైదరాబాద్‌ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

కాగా… సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరుకోవడంతో పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారుల మీదుగా వరద నీరు ప్రవహించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement