హైదరాబాద్ తో సహా పలు జిల్లాలో వర్షం
జంటనగరాలలో జనజీవనానికి ఆటంకం
కరీంనగర్ లో కూలిన దేవాలయం
జగిత్యాలలో కొట్టుకుపోయిన కారు
అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వరద నీరు
తొమ్మిది జిల్లాలకు అరంజ్ అలెర్ట్
మరో రెండు రోజుల పాటు వానలే
హైదరాబాద్ – బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానం కురుస్తున్నది. హైదరాబాద్ తో సహ పలు జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా జంటనగరాలలోని బంజారాహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. పలు చోట్ల రహదారులపైకి వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కుప్పకూలిన పాండురంగ దేవాలయం
భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారత్ థియేటర్ ప్రాంతంలోని 150 సంవత్సరాల చరిత్ర గల పాండురంగ దేవాలయం కుప్పకూలింది.ఇక జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ ఊర చెరువు మత్తడి పొంగిపొర్లడంతో అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో ఇద్దరు మహిళలను గ్రామస్తులు మత్తడి దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు.
వరద నీటిలో కలెక్టరేట్
భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం చుటు వరద నీరు చేరింది. పట్టణంలోని ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉట్కూరు మండలం మల్లెపల్లి వాగు దాటే క్రమంలో వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా మాడుగుల పట్లిల మండల కేంద్రంలో వర్షానికి అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
మరో రెండు రోజులు భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిండుకుండల్లా ప్రాజెక్ట్ లు
భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరగడంతో గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జూరాలకు 3.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 43 గేట్లు ఎత్తి దిగువకు 3.23 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు 3,12,093 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.