కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తాయి. ఈ క్రమంలోనే కర్నాటకలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కోస్తా ప్రాంతాలు, కొండ ప్రాంతాలతో పాటు ఉత్తర కర్నాటక జిల్లాలు కూడా వర్ష బీభత్సాన్ని చవిచూస్తున్నాయి. ఉత్తర కర్నాటక జిల్లాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. రాజధాని బెంగళూరులో ఉదయం చల్లని గాలులు వీచడంతో పాటు చిరుజల్లులు పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో కలబురగి జిల్లాలో శని, ఆదివారాల్లో ఎల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కలబురగి జిల్లా కమీషనర్ పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. బెళగావి, బీదర్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
పశ్చిమ కనుమలలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ నది నీటిమట్టం 3 అడుగుల మేర పెరిగింది. ఇప్పటికే శివార్లలోని నివాస ప్రాంతాలకు నీరు చేరడంతో దండేలి పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 124.80 అడుగుల ఎత్తున్న కేఆర్‌ఎస్ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 34,304 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఔట్ ఫ్లోను 3.307 క్యూసెక్కులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. కావేరి నది ఒడ్డున నివసించే ప్రజలను హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద, కుముద్వాతి, తుంగభద్ర నదులు గరిష్ట స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోస్తా జిల్లా ఉడిపిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ఏజెన్సీలు అంచనా వేశాయి. ఈ క్రమంలోనే శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చిక్కమగ్లూర్, శివమొగ్గ, కొడగు, హాసన్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.