Friday, November 22, 2024

మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, యశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్‌, కామారెడ్డి మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం , పరిసరప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల 11న ఉత్తర అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విస్తారంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా వెనుదిరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్రల నుంచి నైరుతి రుతుపనవాలు వెనుదిరిగాయని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజుల్లో మధ్యభారత దేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత వెనుదిరిగే పరిస్థితులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement