రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కాణంగా ప్రజటు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు, పూర్తిగా తగ్గించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ… ట్రాఫిక్ జామ్‌లు, రోడ్డుపై నీరు నిలిచిపోవడం, వరదలు వంటి సమస్యలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నివారించి పూర్తిగా తగ్గించేందుకు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వాతావరణ సూచనలను (వెదర్ ఫోర్ కాస్ట్‌ను) సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సంఘాల వాట్సాప్ గ్రూపులకు పంపి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున అందించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో దాదాపు వర్షాల కారణంగా ప్రభావితమయ్యే 134 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో వర్షం కారణంగా వరదలు, రోడ్ల పై నీరు నిలిచిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కోరారు. అదేవిధంగా, హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు పలు ప్రాంతాల్లో భారీ స్థాయి నీటి నిల్వ ట్యాంకులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలు, రోడ్లపై నీటి నిల్వలు, వరదల కారణంగా ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించేందుకు జిహెచ్‌ఎంసి, జలమండలి, ఎస్‌పిడిసిఎల్, పోలీసు శాఖలకు చెందిన 630 మాన్‌సూన్ సపోర్టు టీమ్‌లను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశాలతో నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ జీహెచ్‌ఎంసీ రోనాల్డ్ రోస్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆన్‌లైన్ ఎండీ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు.