Friday, November 22, 2024

వానాకాలం సాగు ప్రశ్నార్థకం.. భారీ వర్షాలతో పలు పంటలకు తీవ్ర నష్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏకధాటిగా వారం పది రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షాలు రైతులకు మేలు ఎంత చేశాయో అదే స్థాయిలో నష్టాన్ని కూడా మిగిల్చాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తున్నాయని ఆశించిన రైతులకు భారీ వర్షాలు చివరకు సాగుపై ఆందోళననే మిగిల్చాయి. మొత్తంగా ఇటీవలి వరదలకు వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరద నీరు పొలాలపైకి ఉప్పొంగింది. వరద తాకిడికి వరి నాట్లు, పత్తి, సోయాబిన్‌ మొలకలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది.

ఏదో ఒకటి, అరఫీటు మేర ఇసుక కాదు… చాలా చోట్ల మీటరుకు పైగా మందంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో దాన్ని తొలగించి, మరోసారి పంట సాగుచేసే పరిస్థితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి చేలల్లో వరద నీరు నిలిచి గడ్డి, కలుపు ఏపుగా పెరగడంతోపాటు మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో దాదాపు 3లక్షల ఎకరాల్లో వివిధ పంటలను వరదలు ధ్వంసం చేశాయంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు.

- Advertisement -

పంటల రక్షణపై అవగాహనా కార్యక్రమాలు…

భారీ వర్షాలు తెరిపి ఇచ్చిన నేపథ్యంలో రైతులు వెంటనే పంటల సంరక్షణా చర్యలను ప్రారంభించాలని రైతులకు వ్యవసాయశాఖ సూచిస్తోంది. భారీ వర్షాల తర్వాత పంటలకు వివిధ రకాల తెగుళ్లు (వేరుకుళ్లు, కాండంకుళ్లు, కాయతొలుచు) తదితర తెగుళ్లు, రోగాలు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతులకు పంట రక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వరి పొలాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వరద నీటిని తొలగించి కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ వేయాలని సూచించారు.

వరిలో మొగిపురుగు ఉంటే కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలను ఎకరాకు 8-10కిలోల చొప్పున నాటిన 20-25రోజులలోపు చల్లాలన్నారు. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదని, నీటిని బయటకు పంపించి 25కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్‌ను చల్లాలని సూచించారు. పత్తి చేలల్లో నిల్వ ఉన్న వరద నీటిని సాధ్యమైనంత త్వరగా తీసేస్తేనే పంటకు మనుగడ ఉంటు-ందని తేల్చి చెప్పారు. తేమ తగ్గిన తర్వాత ఎకరాకు 25కిలోల యూరియా, 10కిలోల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలన్నారు. అధిక వర్షాలకు నల్లనేలల్లో వేరుకుళ్లు తెగులు ఆశించే అవకాశాలు ఉన్నందున కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3గ్రాములు లేదా 1గ్రాము కార్బన్డిజంను లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లలో తడపాలన్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం

భారీ వర్షాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగును ప్రశ్నార్థకంగా మార్చివేశాయి. ఇటీవలి అల్పపీడన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలకు ఎక్కువగా పత్తి సాగు చేసిన రైతులే నష్టాలను చవిచూశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో వరదల తాకిడికి పత్తి మొలకలు ఎర్రబారిపోయాయి. మొలకదశలోనే పత్తి మొలకలు ఎర్రబారి, వేరుకుళ్లు తెగులు సోకుతుండడంతో మొక్కలో జీవక్రియ నిలిచిపోయి.. మొక్క ఎదిగే పరిస్థితులు ఉండవని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాష్ట్రంలో దాదాపు 4లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట నీటమునిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువులు, వాగులకు సమీప ప్రాంతాల్లోని వరి చేలను భారీగా వరద ముంచెత్తడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇప్పటికీ పలు జిల్లాల్లో వరినాట్లు పడుతున్నాయి. నాట్ల కోసం పోసిన నారుమళ్లు కొట్టుకుపోయాయని నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో లక్షా 20వేల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. వదలకు అధికశాతం వరినాట్లు కొట్టుకుపోయాయి. మిగతా చోట్ల వరిపొలాల్లో ఇసుక మేట వేసింది. పత్తి, వరి తర్వాత భారీ వర్షాల కారణంగా 30వేల ఎకరాల్లో కంది, 16 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15వేల ఎకరాల్లో వేరుశనగ, కొద్దిమేర పెసర, కాయగూరల పంటలు ముంపునకు గురయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement