హైదరాబాద్ ,ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 61 సెంటీమీటర్లతో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అల్లకల్లోలం చేసిన ఈ భారీ వర్షాలు.. ములుగు, భూపాలపల్లి జిల్లాలను కుదిపేశాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారు మారేడుగొండ చెరువుకట్టకు 3 చోట్ల గండిపడగా.. ప్రవాహానికి ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న బండ సారమ్మ, సారయ్య, రాజమ్మ కొట్టుకుపోగా.. వీరిలో సారయ్య మృతదేహం లభ్యమైంది. మిగతా వారి ఆచూకీ లభించలేదు.
గోవిందరావుపేటలోని బ్రిడ్జి వద్ద దయ్యాలవాగు వరద ఉద్ధృతికి ఇళ్లల్లోకి వరద నీరు చేరగా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పస్ర సమీపంలో జాతీయ రహదారిపై గుండ్లవాగు కట్టకు గండిపడగా.. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపూర్, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయిప్ఖస్ర గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న జలగలంచవాగు బ్రిడ్జి తెగిపోయింది.
శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40నుంచి 50కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.