Tuesday, November 26, 2024

వరంగల్‌లో భారీ వర్షం, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: వరంగల్‌ నగరంలో భారీ వర్షం కురిసింది.. మంగళవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీలోని ప్రధాన రహాదారులన్నీ జలమయంగా మారాయి. అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షానికి వరదలు రావడంతో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అనేక కాలనీలు నీట మునగడంతో పాటు ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో నిత్యావసరాలు పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికే భద్రకాళీ చెరువు, వడ్డేపల్లి చెరువు మత్తళ్లు పడటంతో భారీ వర్షానికి మత్తడి నీరు తోడు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటితో మునిగాయి.

వరంగల్‌లోని పాత బీట్‌ బజార్‌ నుంచి జూపార్క్‌ వరకు భారీ వర్షంతోసంతోషిమాత కాలనీ, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనం ఏరియా, ఖమ్మం బ్రిడ్జి , సిఎస్సార్‌ గార్డెన్‌, జూపార్క్‌ వద్ద రోడ్డుపై నీరుచేరి చెరువులా తలపిస్తోంది. బల్దియా, ఆర్‌అండ్‌బీ అధికారుల సమన్వయ లోపంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా భారీ వర్షం వచ్చినప్పుడే బల్దియా ఇంజనీరింగ్‌ హడావుడి చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా రోడ్డు పనులు చేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని వాహన చోదకులు వాపోతున్నారు. రైస్‌ మిల్లర్స్‌ కార్యాలయం నుంచి వస్తున్న బొందివాగు నిండుకుండలా ప్రవహిస్తోంది. ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల బొందివాగు నీరు ఎన్టీఆర్‌ నగర్‌, సంతోషిమాత కాలనీల్లో ప్రవహిస్తోంది. రోడ్డుపై భారీగా నీరు రావడంతో బుధవారం సాయంత్రం వరకు కూడా వాహనదారులు బిక్కుబిక్కుమంటూ నడుపుతూ పోయారు.

మోటర్‌ సైకిల్‌పై వస్తున్న దంపతులు నీరు నిలిచిన ప్రాంతమున్న గుంతలో పడిపోయారు. వారిని రక్షించేవారు లేక లబోదిబోమంటూ ప్రాణాలతో బయటపడ్డారు. వరంగల్‌ నగర మేయర్‌ గుండు సధారాణి, కమిషనర్‌ ప్రావిణ్య, స్థానిక కార్పోరేటర్లు, అధికారులు లోతట్టు ప్రాంతాలను సందర్శించి నీట మునిగిన వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement