మెదక్/జోగిపేట, ప్రభన్యూస్: మెదక్ జిల్లాలో వాన దంచికొడుతోంది. వాగులు, వంకలు, నిండుగా ప్రవహిస్తున్నాయి. మెదక్, నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఘణపూర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. హలిద ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. హల్దీవాగు నిండుగా ప్రవహిస్తోంది. చెరువులు కుంటల్లోకి నీరు చేరుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. జిల్లా మొత్తంగా 21 మండలాల్లో 4.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా మెదక్ మండలంలో 67.4 మిల్లిమీటర్ల వర్షం పడగా అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 31.7 మిల్లిమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నీరు వచ్చి చేరుతోంది.
సింగూరుకు పోటెత్తిన వరద
భారీగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. గత నెల జూన్ చివరి వారం నుంచే ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. సింగూరు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు, 523.600 మీటర్లు ఉంది. కాగా గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 5236 క్యూసెక్కుల నీరు వచ్చిందని, ప్రస్తుతం నీటిమట్టం 19.981 టీఎంసీలు, 521,508 మీటర్లు ఉందని, జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. యావరేజ్ అవుట్‌ఫ్లో 400 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు మరో 70 క్యూసెక్కులు, ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి 5236 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ఆయన తెలిపారు. వర్షాలు ఇలాగే కురిస్తే ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.