హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మేఘాలకు చిల్లు పడ్డట్లు హైదరాబాద్‌లో మూడు గంటలపాటు భారీ వర్షం దంచి కొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ కొట్టగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం రాత్రి పొద్దుపోయేంత వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీనది వరద ఉధృతి తగ్గడంతో కాస్త ఉపశమనం పొందిన నగర వాసులు మళ్లి జోరు వాన కురియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు, విధులకు వెళ్లిన ఉద్యోగులు, సిబ్బంది భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. రోడ్లకు ఇరువైపులా మోకాల్లోతు నీరు నిలువడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి వరద పారుతుండడంతో అక్కడక్కడ మ్యాన్‌హోళ్లను తెరిచి నీటిని వదిలారు. నగరంలోని పలుచోట్ల రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాగుట్, ఖైరతాబాద్ చౌరస్తాలలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. వర్షానికి ద్విచక్ర వాహనదారులు పూర్తిగా తడిసిపోయారు. మరోవైపు మ్యాన్‌హోల్స్ తెరవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. గంటల తరబడి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. న్యూబోయిన్‌పల్లిలో చెరువు కట్ట తెగి కాలనీలోకి వరద చేరింది. దీంతో ఇండ్లలోకి నీరు రావడంతో కాలనీ ప్రజలు లబోదిబోమన్నారు.
మియాపూర్, శేర్లింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌పీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్, గాజులమారారం, లక్డికాపూల్, సైఫాబాద్, కోటి, బేగంబజార్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రహదారులపైకి భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఓ వాషింగ్ మెషిన్ నీటిలో కొట్టుకుపోయింది. వాషింగ్ మెషిన్‌లను రిపేరు చేసే దుకాణదారుడికి వినియోగదారులు మెషిన్ ఇచ్చి వెళ్లారు. భారీ ఎత్తున వర్షం కురవడంతో వరద వచ్చిందని ఈ నీటి ఉధృతికి వాషింగ్ మెషిన్ కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. వాషింగ్ మెషిన్‌ను ఆపేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నీటిలో వాషింగ్ మెషిన్ కొట్టుకుపోతుండగా కొందరు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే నీటి ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో స్థానికుల యత్నాలు ఫలించలేదు. కిలోమీటర్ల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని క్లియర్ చేసి పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శుక్రవారం నాటి భారీ వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇలా వస్తువులు నీటి పాలయ్యాయని స్థానికులు చెప్పారు. ఉరుములు, ఈదురు గాలులతో వర్షం కురియడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్‌పేట్, హెచ్‌బీకాలనీ తదితర ప్రాంతాల్లో గంటకుపైగా కురిసిన భారీ వర్షానికి రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎటు చూసినా రోడ్లపై నీరు చేరడంతో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డికాలనీ, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
మౌలాలిలో అత్యధిక వర్షపాతం నమోదు..
హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం కురిసిన వర్షానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మౌలాలి సర్కిల్ 28లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 124.8 మిల్లిdమీటర్ల వర్షం కురిసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. మల్కాజ్‌గిరి మండలం నేరెడ్‌మెట్‌లో 73.3, మల్కాజ్‌గిరిలో 51.5, బాలానగర్ మండలం భగత్‌సింగ్‌నగర్, ఫతేనగర్‌లో 50.0, అల్వాల్ మండలం కొత్తబస్తీలో 48.8. కుత్బుల్లాపూర్ మండలం, రంగారెడ్డినగర్‌లో 38.8, హయత్‌నగర్ మండలం హయత్‌నగర్‌లో 34.8, సికింద్రాబాద్ మండలం మోండామార్కెట్‌లో 34.5 మిల్లిdమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.