Friday, November 22, 2024

అనంత‌లో భారీ వ‌ర్షం.. ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం

అనంతపురం బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరద తాకిడికి అనంతపురం నగరంలో గడిచిన 50 సంవత్సరాలు ఇటువంటి వర్షాలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. గురువారం నమోదైన వర్షపాత వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షం అనంతపురంలో కురిసింది. జిల్లాలో ఉన్న పీఏబీఆర్, ఎంపీ ఆర్ చాగల్లు పేరూరు బైరవణ తిప్ప ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 15 వేల క్యూసెక్కుల నీరు పెన్నా నదిలోకి విడుదల చేశారు. అనంతపురం నగరంలోని నడిమి వంకకు వస్తున్న వరద వల్ల సుమారు 15 కాలనీలు నీట మునిగిపోయాయి. ఆరవ రోడ్డు, 5వ రోడ్డు, రజక నగర్ ప్రియాంక నగర్ రాజీవ్ కాలనీ చంద్రబాబు కొట్టాలా ముత్యాలమ్మ కాలనీ, సుందరయ్య నగర్ జాకీర్ కాలనీ ఇలా అనేక కాలనీలు నీటిలో గడిచిన మూడు రోజులుగా ఉంటున్నాయి.

ఇళ్లను వదిలిపెట్టి రాలేక చాలామంది మిద్దెలో ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ముంపు బాధితులను పరామర్శించారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. పునరావాస కేంద్రాలను 15 వరకు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నిరాశ్రయులైన వారి కి యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి నష్టం అంచనా వేసి ప్రతి ఇంటికి కనీసం 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన సొంత నిధుల నుంచి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. 25 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అనేక మండలాల్లో 10 నుంచి 15 సెంటీ మీటర్ల దాకా వర్షపాతం నమోదయింది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement