Friday, October 4, 2024

TG | మరో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిసిన సమాచారం మేరకు శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

శనివారం నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వానలు కురుస్తాయని పేర్కొంది.

- Advertisement -

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, బషీర్‌ బాగ్‌, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌ నగర్‌, లక్డీకాపుల్‌ ట్యాంక్‌ బండ్‌ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌, బాగ్‌ లింగంపల్లి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, గాంధీ నగర్‌, జవహర్‌ నగర్‌, కవాడిగూడ, దోమలగూడ తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.

బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలు దేరిన ఉద్యోగులు, విద్యార్థులు వర్షానికి తడిచిపోయారు.మరోవైపు హైదరాబాద్‌కు ఎల్లో హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది.

రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు రోడ్లను క్లియర్‌ చేయాలని, అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో బల్దియా యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement