హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారీ వర్షాలు ప్రత్యామ్నాయ పంట పత్తిని తీవ్రంగా దెబ్బ తీశాయి. వరుసగా రెండేళ్ల అతివృష్టి ప్రభావం ఈ ఏడాది కూడా కొనసాగి కుండపోత వర్షాలతో పత్తి పంటను కష్టాల పాలుచేసింది. ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా 43 లక్షల ఎకరాల్లోనే రైతాంగం పత్తి పంటను సాగు చేసింది. ఈ పంటను భారీ వర్షాలు మొలక దశలోనే తుంచేశాయి. సుమారు 8.60 లక్షల ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట దెబ్బ తిన్నట్టు ప్రాథమిక సర్వేలో వెల్లడైంది. 2021లో 75 లక్షల ఎకరాల్లో పత్తి
సాగు లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 46.43 లక్షల ఎకరాల్లోనే పత్తి పంట సాగైంది. ఆ ఏడాదిలో కూడా భారీ వర్షాలు రైతాంగాన్ని తీవ్ర దెబ్బ తీశాయి. ప్రతియేటా పత్తి విత్తనాలు నాటేందుకు జులై 15 వరకు అనువైన సమయంగా రైతాంగం భావిస్తుంది. ఒకవేళ ఆ తర్వాత జాప్యంతో సాగు చేసినా గులాబీ రంగు పురుగు, కాయకుళ్లు తెగులు, బూడిద తెగుళ్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావంతో తొలి దశలోనే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే విధంగా దిగుబడి కూడా డిసెంబర్లో చేతికందడంతో శీతాకాల ఉష్ణోగ్రతలు దిగుబడిపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే జూన్ మొదటి వారం నుంచి జులై 15 వరకు పత్తి విత్తనాలు నాటితే మేలు జరుగుతుందని, ఒకవేళ పంట దెబ్బ తింటే తిరిగి మళ్లిd నాటేందుకు సమయం ఉంటుందని కానీ ఇప్పుడు ఆ అదును దాటిపోయిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న పత్తి తొలగించి ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. భారీగా పంట దెబ్బ తిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పత్తిని తొలగించిన రైతులు ఆ స్థానంలో కందిని సాగు చేస్తున్నారు. కంది సాగుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉండడంతో పాటుగా పొద్దుతిరుగుడు ఆగస్టు వరకు అవకాశం ఉంది. అదే విధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆముదం సాగుకు, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో సోయాబిన్‌కు అవకావం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వరికి బదులుగా పత్తి సాగును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. వానాకాలంలో వరిని 45 లక్షలకు పరిమితం చేసి 75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని సంకల్పించింది.
అయితే గడిచిన రెండు ఏడాదుల్లో 20 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బ తిన్నది. ఈ నేపథ్యంలో పత్తి పంటను సాగు చేసేందుకు రైతులు భయ పడుతున్నారు. ఈ సీజన్లో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా గత ఏడాది కంటే 18 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రత్యామ్నాయం పంటలకు ప్రభుత్వం ప్రచారం చేసినా అది పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వానాకాలంలో మొత్తం సాగు 58 శాతానికి చేరింది. 44.53 లక్షల ఎకరాల్లో పత్తి, 11 లక్షల ఎకరాల్లో వరి, 53 శాతం పప్పుధాన్యాలు, 69 శాతం నూనె గింజలు సాగయ్యాయి. అయితే అసాధారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ తదితర జిల్లాల్లో పంట ఇంకా నీటిలోనే మునిగి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరద కారణంగా పంట పొలాల్లో బురద మట్టితో నిండిపోయాయి. ఇసుక మేటల్లో పంట పొలాలు ీరైతాంగానికి తీరని నష్టం కలిగిస్తూ ఇతర పంటల సాగుకు ఇబ్బందికరంగా మారాయి. త్వరలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పూర్తి నష్టం అంచనా వేసేందుకు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పంట నష్టం భారీగా జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.