కోదాడ, ప్రభన్యూస్: తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద కోదాడ గ్రామీణ పోలీసులు భారీ స్థాయిలో 253 కేజీల గంజాయిని పట్టుకున్నారు. సోమవారం కోదాడలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని శిరిడి పట్టణంలో సాయి దర్శన్ నందు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్న అంటదాస్ శ్రీధర్ బంకర్, రవిరాజులు డ్రైవర్ వృత్తి ద్వారా వచ్చే ఆదాయం సరిపోక గంజాయి అక్రమ రవాణా చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఈనెల 15న శిరిడిలో కారు కిరాయికి తీసుకొని 16 ఉదయం రాజమండ్రికి చేరుకున్నారని ,అక్కడ మూడో నిందితుడిగా ఉన్న శంబాజీ శశిదాసు కు ఫోన్ చేయగా మరో వ్యక్తి సాయంతో ఇన్నోవా కారులోని వెనుక భాగంలో 253 కేజీల 400 గ్రాముల గంజాయిని లోడ్ చేసుకొని అదే రోజు రాత్రి అక్కడి నుండి బయలుదేరి విజయవాడ, కోదాడ, హైదరాబాద్ మీదుగా షిరిడి వెళ్లేందుకు
వస్తుండగా తెలంగాణ సరిహద్దు కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద అప్పటికే వాహనాలు తనిఖీలు చేస్తున్న కోదాడ గ్రామీణ పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున గంజాయి ఉండడాన్ని చూసి కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు చెప్పారన్నారు. దీంతో గంజాయితోపాటు ఇన్నోవా వాహనాన్ని వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు- తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అంటాదాస్ శ్రీధర్ బంకర్ పై గతంలో పశ్చిమగోదావరి జిల్లా ధర్మోజి గూడెం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసు ఉన్నదని ఎస్పీ తెలిపారు . కాగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్న గ్రామీణ సిఐ పి ప్రసాద్, ఎస్సై సాయి ప్రశాంత్ లను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
కోదాడ పట్టణంలో 10 కేజీల గంజాయి పట్టివేత
కోదాడ పట్టణంలోని దుర్గాపురం బైపాస్ వద్ద పట్టణ ఎస్సై రాంబాబు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి బస్సులో నుండి ఒక వ్యక్తి బ్యాగులతో సహా దిగి పారిపోవుటకు ప్రయత్నించగా అతడిని పట్టు-కొని తనిఖీ చేయగా అతడి వద్ద నిషేదిత 10 కిలోల గంజాయి లభించినది అని ఎస్పీ తెలిపారు. అతడిని అదుపు లోకి ప్రశ్నించగా తన పేరు తాడి మహేష్ బాబు కూకట్ పల్లి లోని గౌతమి కాలేజీలో ఇంటర్ చదువుతున్నా ను అని , సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం సింగూరు గ్రామం అని, తాము చాన్నాళ్ల క్రితం హైద్రాబాద్ లో స్థిర పడినట్లుగా తెలిపా డు అన్నారు. తాను మందు, గంజాయికి బాగా అలవాటు పడినందున మరియూ గంజాయి కొనుగోలుకి డబ్బులు లేనందున, తాను త్రాగటానికి ,అమ్మటానికి గానూ తనకు బాగా పరిచయం ఉన్న వైజాగ్ జిల్లా పాడేరు అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఈనెల 16న కిలో గంజాయి ఒక్కింటికి . 3,000 రూపాయల చొప్పున 10 కేజీల కొని హైద్రాబాద్, కూకట్ పల్లి లోని భరత్ నగర్ కి తీసుకువెళ్లి అక్కడ కిలో ఒక్కింటికి రూ.10,000/ చొప్పున అమ్ముకుందామని బస్సులో వైజాగ్ మీదుగా హైద్రాబాద్ కు వెళుతుండగా పోలీసు వారి వాహనాల తనిఖీలో పట్టుబడ్డట్టు ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు అనంతరం పంచనామా నిర్వహించి గంజాయి, రెండు బ్యాగులు, ఒక మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన కోదాడ పట్టణ సీఐ ఏ నరసింహారావ పట్టణ ఎస్సైలు రాంబాబు, నాగభూషణ రావు, సిబ్బంది ఏ ఎస్ ఐ మల్లేష్ సిబ్బందిని డి.ఎస్.పి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ లు అభినందించారు. పోలీసులకు రివార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.