Thursday, November 21, 2024

Cold wave : ఢిల్లీని క‌మ్మేసిన పొగ‌మంచు…. వణికిస్తున్న చలిగాలులు…

ఉత్తరాది రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు పంజాబ్, యుపిని కప్పేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌లలో చలి గాలులు, దట్టమైన పొగమంచు అలుముకుంది.

రాబోయే కొద్ది రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలి గాలులు, దట్టమైన పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్,పశ్చిమ మధ్యప్రదేశ్ లో ఉరుములు లేదా వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. ఒక మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 17, 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

పంజాబ్, హర్యానా, చండీగఢ్,ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రదేశాలలో దట్టమైన పొగమంచు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్‌లోని వివిధ ప్రదేశాలలో ఉరుములు,మెరుపులు,వడగళ్లతో వర్షం కురవవచ్చని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలో చలిగాలులు కొనసాగుతున్నందున ప్రజలు మంటల చుట్టూ కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement