ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో 22మంది మరణించారు. తూర్పు యూపీలో భారీ వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలకు లక్నోలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో పక్కనే గుడిసెల్లో నివసిస్తున్న వారిపై శిధిలాలు పడి 9 మంది కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
క్షతగాత్రులను డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఇక ఉన్నావ్, ఫతేపూర్, ప్రయాగరాజ్, సీతాపూర్, రాయ్‌బరేలి, ఝాన్సీ జిల్లాల్లో వరద ఉధృతికి 13 మంది మరణించారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ4 లక్షల పరిహారం ప్రకటించిందని సీఎం కార్యాలయం తెలిపింది.