హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ కారణంగా జంట జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో మూసీ నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల 12 వరద గేట్లను తెరిచి.. నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నగరంలో సోమవారం నుంచి వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర తెరిచింది. ఇవ్వాల (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇన్ ఫ్లో 1,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,380 క్యూసెక్కులు నమోదైంది. అదేవిధంగా హిమాయత్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఇన్‌ఫ్లోలు వస్తుండటంతో.. జలాశయంలోకి ఇన్ ఫ్లో 4 వేలకు చేరింది. దీంతో ఆరు క్రెస్ట్ గేట్లను తెరిచి 4,120 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు అధికారులు.
జంట జలాశయాల గేట్లను తెరిచిన నేపథ్యంలో, మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ నది ఒడ్డున ఉన్న చాదర్‌ఘాట్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులో నీటిమట్టాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవల్ దగ్గరకు వస్తున్న నీరు 513.42 మీటర్లకు చేరుకుంది