ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 4,39,987 క్యూసెక్కుల మేర వస్తుండగా, 4,11,376 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 586.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలకుగాను 302.9125 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు 3,65,252 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 4,39,987 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 884.60 అడుగులకు ఉన్నది. శ్రీశైలం గరిష్ఠ నీటినిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.