Tuesday, November 26, 2024

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. రూ.40 లక్షల ఆస్తి నష్టం

ఊట్కూర్, ( ప్రభన్యూస్) : ఊట్కూర్ మండల కేంద్రం శివారులో విజయ కాటన్ మిల్లులో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ .40 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తాసిల్దార్ తిరుపతి విలేకరులకు తెలిపారు. విజయ కాటన్ మిల్లులో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో అందులో పనులు చేస్తున్న కార్మికులు కూలీలు బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడుతూ విపరీతమైన పొగ వ్యాపించడంతో నిర్వాహకులు నారాయణపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన తరలివచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం వచ్చినట్లు తెలిపారు. మంటలు అదుపు చేసేందుకు రైతులు యువకులు అగ్నిమాపక సిబ్బందికి సహాయం అందజేశారు. మంటలు ఆర్పేందుకు చాలా సమయం పట్టింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయిన భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడటం దట్టమైన పొగలు వ్యాపించడంతో నారాయణపేట -మక్తల్ వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆర్ డీ ఓ రామచందర్, డిఎస్పి సత్యనారాయణ, తాహసిల్దార్ తిరుపతి, సిఐ సీతయ్య ,ఎస్సై రాములు ,సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుమలత, పరిశీలించి వివరాలు సేకరించారు. పత్తి మిల్లు అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ శ్రీ హర్షకు నివేదిక సమర్పించినట్లు తాసిల్దార్ విలేకరులతో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement