అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతోంది. ఇప్పటికే తిరుపతి-తిరుమల మధ్య విద్యుత్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.. తిరుపతి నుంచి నెల్లూరు, మదనపల్లి వంటి ప్రాంతాలకు విద్యుత్ బస్సులు నడుపుతోంది. అంత కంటే చౌక ధరలకు అద్దె ప్రాతిపదికన విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించుకొని కేంద్ర ప్రభుత్వానికి వెయ్యి బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. విజయవాడ, విశాఖపట్టణాలకు ఐదేసి వందల చొప్పున విద్యుత్ బస్సులు కావాలని పేర్కొంటూ ఈ ప్రతిపాదనలు అందజేసినట్లు అధికారులు చెపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలపై ఇచ్చే సబ్సిడీని భారీగా తగ్గించింది. గతంలో 40శాతం సబ్సిడీ ఉండగా.. ప్రస్తుతం 15శాతానికి కుదించింది. కుదించిన సబ్సిడీని భారీ వాహనాలకు ఇచ్చే ప్రతిపాదనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో సబ్సిడీల పేరిట వివిధ సంస్థల నుంచి తక్కువ మొత్తానికి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకొని రాష్ట్రాలకు పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
అద్దె వాహనాలకు టెండర్లు..
దేశంలోని వివిధ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల(ఆర్టీసీ)లకు అవసరమైన విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన సమీకరించేందుకు కేంద్రం టెండర్లు పిలిచింది. సెంట్రల్ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్ సంస్థ ఆరు వేల అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవగా.. పలు సంస్థలు పోటీలు పడి తక్కువ ధరలను కోట్ చేశాయి. మరితం తగ్గింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు టెండరుదారులతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల అవసరాలకు ఎన్ని బస్సులు కావాలనే దానిపై ప్రతిపాదనలు కోరింది.
కేంద్రం పిలుపుతో ఏపీకి వెయ్యి విద్యుత్ బస్సులు కావాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. బస్సుల అవసరం, రూట్లు తదితర సమగ్ర వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఏపీ అధికారుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పటికే ఇంధన పొదుపు, కాలుష్య రహిత వాతావరణం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. కాలుష్య రహిత ప్రయాణం కోసం విద్యుత్ బస్సులు ఉపకరిస్తాయని చెపుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు కేంద్రం కూడా సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
500 బస్సుల చొప్పున..
కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్న వెయ్యి విద్యుత్ బస్సుల్లో ఐదొందలు విజయవాడకు, మరో ఐదొందల బస్సులు విశాఖ పట్టణానికి కేటాయించనున్నారు. ఇప్పటికే తిరుపతి జోన్‌లో విద్యుత్ బస్సుల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని విజయవాడ, విశాఖ జోన్లకు ప్రతిపాదనలు పంపారు. వెయ్యి బస్సుల్లో కొన్ని ఏసీ, నాన్ ఏసీ సర్వీసులు కూడా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్టణం, విజయవాడ సిటీల్లో సీఎన్‌జీ బస్సుల నిర్థేశిత కిలో మీటర్లు పూర్తి చేసుకోబోతున్నాయి. లక్షల కిలో మీటర్లు తిరగడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
కొన్ని బస్సులు చిన్నపాటి సాంకేతిక లోపానికే షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని సీఎన్‌జీ బస్సుల స్థానంలో కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను సిటీల్లో నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. మరికొన్ని బస్సులను సెమీ అర్బన్ కింద వివిధ నగరాలు, జిల్లా కేంద్రాల నుంచి సమీప గ్రామీణ ప్రాంతాలకు నడపాలని అధికారులు భావిస్తున్నారు.
అంతకంటే తక్కువ..
ఆర్టీసీ తిరుపతి నుంచి తిరుమల, సమీప జిల్లాలకు వంద విద్యుత్ బస్సులను నడుపుతోంది. తిరుపతి-తిరుమల మధ్య 50, తిరుపతి నుంచి సమీప జిల్లాల కేంద్రాలకు మరో 50 బస్సులను నడుపుతున్నారు. గతంలో ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలవగా తక్కవకు నడిపేందుకు ఈవీ ట్రాన్స్ సంస్థ ముందుకొచ్చింది. తిరుమల ఘాట్ రోడ్డులో కిలో మీటరుకు రూ.52.52 చొప్పున, తిరుపతి నుంచి జిల్లా కేంద్రాలకు కిలో మీటరుకు రూ.44.95 చొప్పున అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే ఈవీ సంస్థ తక్కువ ధరకే విద్యుత్ బస్సులు నడపడంపై ఆర్టీసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో అంతకంటే తక్కువకే అద్దె ప్రాతిపదికన విద్యుత్ బస్సులు రానున్నట్లు అధికారులు చెపుతున్నారు.
సబ్సిడీ మల్లింపు..
కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి విద్యుత్ వాహనాల కొనుగోళ్లపై 40శాతం సబ్సిడీ ఇస్తోంది. ఐదేళ్ల పాటు సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో విద్యుత్ వాహనాల వాడకం పెరిగింది. గత నెల 30తో ఐదేళ్లు పూర్తి కావడంతో విద్యుత్ వాహనాల కొనుగోళ్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. వాహనాలపై 25శాతం తగ్గించి 15శాతానికి సబ్సిడీని కుదించింది.
రానున్న రోజుల్లో సబ్సిడీ తగ్గింపును ద్విచక్ర, తేలికపాటి వాహనాలకు పరిమితం చేసి భారీ వాహనాలకు మల్లించేందుకు యోచిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు వినియోగించే భారీ వాహనాలకు 15శాతం సబ్సిడీని మరికొంత పెంచే అవకాశం ఉంది. ఇది ఎంత వరకు ఉంటుందనేది కొద్ది రోజుల్లోనే కేంద్రం స్పష్టం చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.