మన దేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచింది. తక్కువ ధరకే అభిస్తుండటంతో మన దేశం రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయల్‌ను దిగుమతి చేసుకుంటున్నది. జనవరి నెలలో ఇది మునుపెన్నడూలేనంతగా ఈ దిగుమతులు పెరిగాయి. గతంలో రష్యా ఉంచి 1 శాతం కన్నా తక్కువ ఉన్న దిగుమతులు నేడు 28 శాతానికి చేరాయని ఎనర్జీ కార్డో ట్రాక్ర్ వోర్టెక్సా తెలిపింది.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ముందు రష్యా నుంచి మన క్రూడ్ ఆయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్‌పై దాడి తరువాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆదాయం కోసం ముడి చమురును డిస్కౌంట్ ధరకే రష్యా సరఫరా చేస్తోంది. దీంతో చైనా, భారత్ భారీగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. జనవరి నెలలో రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు 28 శాతానికి చేరాయి. డిసెంబర్లో ఇది 26 శాతంగా ఉంది. రష్యా తరువాత ఇరాక్ 20 శాతం, సౌదీ అరేబియా 17 శాతం, అమెరికా 9 శాతం, యూఏఈ 8 శాతం ముడి చమురును మన దేశానికి సరఫరా చేస్తున్నాయి.
దేశీయ అవసరాల కోసం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఇండియా ఎనర్జీ వీక్(ఐఈడబ్ల్యూ) కార్యక్రమానికి హాజరైన అధికారులు తెలిపారు. ఇరాక్, వెనుజులా మినహాయిస్తే రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకునే విషయంలో భారత్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు తెలిపారు. రష్యా ఆయిల్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితిని జీ7 దేవాలు విధించాయి. భారత్ అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకోవడం పట్ల అమెరికా అభ్యంతరం చెప్పటినప్పటికీ మన దేశం దాన్ని పట్టించుకోలేదు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది.