Monday, November 25, 2024

భారత సరిహద్దులో భారీగా చైనా డ్రోన్లు.. శాటిలైట్‌ ఇమేజ్‌లతో వెలుగులోకి

జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్‌ బేస్‌లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ ఘర్షణల తర్వాత డ్రాగన్‌ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు సమీపంలో ఉన్న టిబెట్‌ విమానాశ్రయంలో అత్యాధునిక డ్రోన్లు, జెట్‌ విమానాలను చైనా మోహరించింది. ఆ డ్రోన్లు, జెట్లకు సంబంధించి హై రెజల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజ్‌లు లీకయ్యాయి. మాక్సర్‌ సంస్థ ఆ ఫొటోలను రిలీజ్‌ చేసింది. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌ బోర్డర్‌ సమీపంలోని తవాంగ్‌ వద్ద చైనా- భారత సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టిబెట్‌ విమానాశ్రయం బాంగ్డా ఎయిర్‌బేస్‌లో భారీ సంఖ్యలో డ్రోన్లు, జెట్లను ఉంచినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేశారు. అరుణాచల్‌ వద్ద చైనా కదలికలకు పెరగడంతో ఇటీవల భారత వైమానిక దళం యుద్ధ విమానాలతో పెట్రోలింగ్‌ కూడా నిర్వహించింది. చైనాలోని బాంగ్డా ఎయిర్‌బేస్‌ అరుణాచల్‌ బోర్డర్‌ నుంచి 150 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ బేస్‌లో అత్యాధునిక డబ్ల్యూజెడ్‌-7 సోరింగ్‌ డ్రాగన్‌ డ్రోన్‌ను మోహరించారు. 2021లోనే ఆ డ్రోన్‌ను ఆవిష్కరించారు.

ఇది 10గంటలపాటు నాన్‌స్టాఫ్‌గా ఎగరడం దీని ప్రత్యేకత. నిఘాతో పాటు క్రూయిజ్‌ క్షిపణులను ఇది భూమిపై లక్ష్యాలపై ప్రయోగించగలదు. అయితే ప్రస్తుతం భారత్‌ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవు. అయితే ప్రస్తుతం ఇండియా ఎయిర్‌ ఫోర్స్‌ కోసం హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌తో కలిసి కొత్త తరం డ్రోన్లను తయారు చేస్తోంది. డిసెంబర్‌ 14 తీసిన చిత్రాల్లో చైనా బాంగ్డా ఎయిర్‌బేస్‌లో రెండు ప్లాంకర్‌ తరగతికి చెందిన ఫైటర్‌ జెట్లను ఉంచింది. ఈ రకం ఫైటర్‌ జెట్లు రష్యా సుఖోయ్‌-30 ఎంకేఐ తరహా విమానాలు మేడ్‌ ఇన్‌ చైనా వేరియంట్లు. ముఖ్యంగా 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా ఈశాన్య సరిహద్దుల్లో సైనికీకరణను పెంచింది. లాసా గోంగ్‌గర్‌ విమానాశ్రయం రన్‌వేను విస్తరించింది. టిబెట్‌ ప్రాంతంలోని అన్ని ఎయిర్‌ బెస్‌లను అప్‌ గ్రేడ్‌ చేసింది. సైనికులను వేగంగా తరలించేందుకు రోడ్డు, రైలు మార్గాలను విస్తరించింది. భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో (తవాంగ్‌ సెక్టార్‌) ఇరు దేశాల సైనికులు ఘర్షణతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. చైనా మూడు కీలక ఎయిర్‌ బేసుల అభివృద్ధి చేస్తోంది.

బంగ్డా(అరుణాచల్‌ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు), లాసా (సరిహద్దు నుంచి 260కిలోమీటర్లు), షిగట్సే (సిక్కిం సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు) ఎయిర్‌ బేసులను అభివృద్ధి చేసింది. అయితే భారత్‌ తేజ్‌పూర్‌, మిస్సమారి, జోర్హాట్‌, హషిమారా మరియు బాగ్డోగ్రాలతో సహా అసోం, బెంగాల్‌ ప్రాంతాల్లో ఎయిర్‌ బేసులను నిర్వహిస్తోంది. చైనా ఎయిర్‌ బేసులతో పోలిస్తే భారత ఎయిర్‌ బేసులు వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. చైనా ఎయిర్‌ బేసులు పూర్తిగా టిబెట్‌ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో బరువులను మోసుకెళ్లాలంటే చైనా విమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అయితే భారత్‌ వైమానికి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు సులువుగా ఇంధనం, క్షిపణులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement