Thursday, November 14, 2024

జర పైలం.. దంచికొడుతున్న ఎండలు.. వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రభన్యూస్‌, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగలు వేడి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంటుంది. గత వారం రోజులుగా పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో పాటు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఉమ్మడి మెదక్‌లో 40 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం మెదక్‌లో 40 డిగ్రీలు, సిద్ధిపేటలో 40.5, సంగారెడ్డిలో 40.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విధర్భ నుండి కర్ణాటక మీదుగా శ్రీలంక సరిహద్దు వరకు 900 మీటర్ల వరకు ఉపరితల ధ్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ఎండా, వేడిగాలులు, ఉక్కపోత ఉంటాయని ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెల్పింది.

అల్లాడిపోతున్న జనాలు..

ఉదయం 8 గంటల నుండే భానుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. 11 గంటలు దాటిదంటే ఇంటి నుండి కాలు బయటపెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు. మద్యాహ్నం 12 గంటలకే రోడ్లు పూర్తిగా నిర్మాణుష్యంగా మారుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు తోడు ఉక్కపోత, వేడిగాలులు కూడా తోడవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉదయం 11:30 గంటల నుండి సాయత్రం 4 గంటల వరకు బయటకు రావాలని లేని పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండాలని సూచిస్తుంది. ఇక వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ వడదెబ్బ జాగ్రత్తలు ప్రతిని విడుదల చేసింది.

వేసవి నుండి ఉపశమనం కోసం జనాల తంటాలు..

దంచికొడుతున్న ఎండల నుండి ఉపశమనం పొందేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇంటిపట్టునే ఉండేందుకు వీలైంనంత వరకు ప్రయత్నిస్తున్నారు. పగటిపూట ఏసీలు, కూలర్ల వాడటం ద్వారా శరీరాన్ని చల్లబర్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఇక ఫ్రిడ్జ్‌ల కొనుగోళ్లు, ఏసీల కొనుగోళ్లు పెరిగాయి. సామాన్యుడు మట్టికుండల కొనుగోళ్ల పై ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఇక తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కువగా నీటిశాతం ఉండే కూరగాయలను వండుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఆహారం కంటే ఎక్కువగా నీరు, పానీయాలు, జ్యూస్‌లపై మక్కువ పెంచుకుంటున్నారు.

- Advertisement -

లక్షణాలు గుర్తించి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇక వేసవిలో ఎక్కువగా వినిపించే మాట వడదెబ్బ. వడదెబ్బ నుండి మనల్ని మనం రక్షించుకునేందుకు సంసిద్ధంగా ఉండాలి. లక్షణాలు గుర్తించి వెంటనే అప్రమత్తమైతే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా, చెమట పట్టక పోవడం శరీర ఉష్ణోగ్రత పెరగడం శరీరం వణుకుపుట్టడం మగత నిద్ర లేదా కలవరింపులు ఫిట్స్‌ లేదా పాక్షికంగా అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు రోగి శరీరంలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనపించిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించి సమీపంలో ఆసుపత్రికి రోగిని తరిలిస్తే ప్రాణాపాయం నుండి రక్షించవచ్చు.

వడదెబ్బ నుండి తక్షణ ఉపశమనం కోసం..

వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడలోకి తీసుకొచ్చి శరీర ఉష్ణోగ్రత చల్లబడేలా చూడటం. చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తూడ్చాలి. చల్లని గాలి తగిలేలా ఫ్యాన్‌, లేదా చెట్ల కింద కూర్చోబెట్టడం
ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పుకలిపిన గ్లూకోజు ద్రావణం పట్టించడం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రవాణం( ఓఆర్‌ఎస్‌) తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి ఎట్టి పరిస్థితుల్లో నీరు తాగించరాదు. వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.

వేసవిలో ఎండ నుండి ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ నుండి పెరుగుతున్న ఉష్ణోగ్రతల పై హెచ్చరికలు సూచనలు చేయడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉదయం 11:30 తర్వాత బయటకు వెళ్లాలి. ఇక పిల్లలు, వృద్దులు, గర్భీణీలు బయటకు పోకపోవడమే ఉత్తమం. వేసవిలో కాటన్‌ దుస్తులతో పాటు తలగడ ధరించడం శ్రేష్టం. కళ్లజోడు తప్పనిసరి. బయటకు వెళ్లే సమయంలో గొడుగు కూడా వాడవచ్చు. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఎక్కువగా లిక్విడ్స్‌ తీసుకోవాలి. పళ్లరసాలతో పాటు మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. ఇక వడదెబ్బ తగిలితే వెంటనే రోగి శరీరం చల్లబర్చాలి. ఇందుకోసం రోగిని నీడపట్టుకు తీసుకొచ్చి తడిబట్టతో శరీరాన్ని తూడ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఓఆర్‌ఎస్‌ వంటి ద్రావణాన్ని పట్టించడం ద్వారా రోగి త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement