సరిగ్గా కాంగ్రెస్ అధిష్ఠానం గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన సమయంలోనే కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ సొంత పార్టీపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ పీసీసీలో కొందరు తనను పక్కన పెట్టేస్తున్నారని, పార్టీ వీడి వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పీసీసీ తనను అష్టకష్టాలూ పెడుతోందని ఆరోపించారు. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లానని, అయినా ఫలితం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో గుజరాత్ పీసీసీ నేతలు లోపాయికారీ ఒప్పందం పెట్టుకోవడం వల్లే అధికారానికి కాంగ్రెస్ దూరమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్లో 2017 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని, కానీ… తప్పుడు నేతలకు టిక్కెట్ ఇవ్వడం వల్లే ఓడిపోయిందని హార్థిక్ పటేల్ అన్నారు.
తనను గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారని, అయినా తనకు అధికారాలేమీ లేవని హార్థిక్ పటేల్ వాపోయారు. అత్యంత కీలకమైన సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని, ఏ నిర్ణయాల్లోనూ తనను భాగస్వామిని చేయడం లేదని పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించి, మూడు సంవత్సరాలు గడించిందని, అయినా అధికారాలు ఇవ్వరా? అంటూ హార్థిక్ పటేల్ తీవ్రంగా మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..