హైదరాబాద్,ఆంధ్రప్రభ బ్యూరో : చిన్నతనంలోనే గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మూడు, నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. క్రికెట్ ఆడుతూ ఛాతి నొప్పికి గురై అపస్మారక స్థితికిలోనై అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పాఠశాలలు, హాస్టళ్లలో జరుగుతున్న కార్డియో అరెస్ట్ సంఘటనలు జరిగితే వెంటనే అప్రమత్తమై విద్యార్థుల ప్రాణాలను అరికట్టి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ విధిగా కార్డియో పల్మునరీ రిసొసి టీషన్ (సిపిఆర్) శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించింది. సిపిఆర్ అని పిలిచే ఈ ప్రక్రియ కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయంలో అప్రమత్తమై గుండెపై భాగాన్ని అదిమిపట్టి మసాజ్ చేస్తే సగం మందిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని బయట ఇటీవల జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది.
గుండె నుంచి రక్తం సరఫరా చేసే రక్త నాళాలు ముసుకు పోవడం(బ్లాక్ కావడం) వల్ల వచ్చేదే కార్డియాక్ అరెస్ట్ అని వైద్యులు చెబుతున్నారు. రక్త నాళాలు మూసుకుపోవడంతో వచ్చే గుండెపోటు నుంచి తప్పించేందుకు సిపిఆర్ ఎంతో ఉపయోగ పడుతుందని సిపిఆర్ చేయడం వల్ల రక్తం సరఫరా వేగవంతంమై బ్లాకులు క్లియర్ అవడం వల్ల జనాలు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుండె సంబంధిత వైద్యులు చెబుతున్నారు.
సిపిఆర్ చేయడం తెలియక పోవడంతోనే మరణాలు !
ఈ మధ్యకాలంలో జరుగుతున్న మరణాల్లో సగం కంటే ఎక్కువ కార్డియాక్ అరెస్ట్‌తోనే జరుగుతున్నాయి. కార్డియాక్ అరెస్ట్ జరిగినపుడు అందుబాటులో ఉన్నవారికి సిపిఆర్ చేయడం తప్పనిసరి. అయితే సిపిఆర్ చేయడం తెలియకపోవడం, దగ్గర్లో ఆసుపత్రులు లేకపోవడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపోటు వచ్చిన సమయంలో ఆ మనిషి పక్కన లేదా దగ్గర్లో ఉండేవారిలో ఏ ఒక్కరికైనా సీపీఆర్ గురించి అవగాహన ఉంటే ప్రాణాన్ని కాపాడినవాళ్లవుతారని చెబుతున్నారు.
ఇందుకోసమే తెలంగాణ ప్రభుత్వం త్వరలో అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదో కొద్ది రోజులు మొక్కుబడిగా కాకుండా ప్రతి తరగతి సిలబస్‌లో ప్రాథమిక వైద్యం అని సబ్జెక్ట్ పెట్టి పూర్తిస్థాయిలో వారికి వైద్యంపై అవగాహన కలిగించాలని ఇటు పాఠశాల విద్యా శాఖ వైద్యశాఖలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలల్లో వారానికి రెండు మూడు రోజులు ఒక పీరియడ్ సిపిఆర్ శిక్షణ కోసం కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం కేవలం సీపీఆర్ మాత్రమే కాకుండా అత్యవసర సమయాల్లో విద్యార్థులు ఎటువంటి అనారోగ్యానికి గురైనా ఇంకా ఇతర సమస్యలకు లోనైనా అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడుకునే తరగతి గదిలో బోధించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఉదాహరణకు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురైతే రోడ్డు పక్కన ఉండే వారు ఎటువంటి సహాయం అందించాలి. కాలు లేదా చేయు విరిగితే రక్తం స్త్రావం జరక్కుండా ఎలా ఆపాలి. ఇంట్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి? ఇలాంటివన్నీ పాఠశాల గదిలో అందించాలని తెలంగాణ విద్యాశాఖ ప్రతిపాదించినట్టు చెబుతున్నారు.
వాస్తవానికి కేవలం విద్యార్థులకే కాకుండా ప్రతి పౌరునికి ఇవన్నీ అవసరమని దీంతో తమ ప్రాణాలనే కాకుండా తనతో ఉన్నవారు ఎటువంటి ఆపదలో ఉన్నా వారి ప్రాణాలను కూడా రక్షించుకునే అవకాశం ఉంటుందని ఇందుకు వారందరికీ అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. స్కూళ్లలోనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రవాణా వ్యవస్థల్లో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కార్డియాక్ పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
అలిసిపోతున్న గుండె
చిన్నారులు, యువకుల గుండె అలసిపోయి అకస్మాత్తుగా ఆగిపోతున్న ఘటనలు రోజూ అనేకం చూస్తున్నాం. జ్వరం, జలుబు వచ్చినంత ఈజీగా గుండెపోటుకు గురికావడం సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుకు యాభై, అరవై ఏళ్ళు దాటిన వారికే గుండె పాటు వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా మనుషులు కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు ఆడి పాడిన ఆ హృదయం ఒక్కసారిగా ఆగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
గుండెపోటుకు కారణాణాలేవైనా కొంతమందినైనా కాపాడేందుకు పరిష్కారం మాత్రం ఉంది. అదే సిపిఆర్. కార్డియో పల్మునరీ రీసోసిటేశన్- సీపీఆర్ అని పిలవబడే ఈ ప్రక్రియ కార్డియాక్ అరెస్టు జరిగిన సమయంలో అ్లప చేస్తే సగం మందిని కాపాడే అవకాశం ఉంటుంది. గుండెలో నుంచి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ కావడం వల్ల వచ్చేదే కార్డియాక్ అరెస్ట్. ఆ సమయంలో సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరిగి బ్లాక్ క్లియర్ అవ్వడం వల్ల కార్డియాటిక్ అరెస్ట్ కు గురైన వారు ప్రాణాపాయం నుంచి బయటపడి బతికే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ స్పెషలైజేషన్ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
దశల వారీగా !
సిపిఆర్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచి అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఎలా ముందుకెళ్లాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై తొలుత పాఠశాలలు ఆ తర్వాత కళాశాలలు, యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదన పై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసిల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని ఇందుకు తరగతిగదిలోనే శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నత విద్యా మండలి పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.