Saturday, November 23, 2024

వేసవి సెలవుల తర్వాతే విభజన కేసుపై విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వేసవి సెలవుల అనంతరం చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం కేసు విచారణకు రాగా.. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోయింది. కేసులో చాలా మంది వాదప్రతివాదులు ఉన్నందున వేసవి సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర విభజనపై ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, తెలంగాణ వికాస కేంద్రతో పాటు పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు పిటిషనర్లు పేర్కొనగా.. విభజన చట్టం సరిగా అమలుకావడం లేదంటూ మరికొందరు పిటిషనర్లు పేర్కొన్నారు. కేసులో ప్రతివాదుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ వాదన తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి కూడా ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది.

- Advertisement -

పిటిషనర్లలో ఒకరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాను విభజనకు వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలేదని, నిబంధనల ప్రకారం విభజన ప్రక్రియ జరగలేదన్నదే తన అభ్యంతరమని చెప్పారు. విభజన ఎలా జరగాలి? దానికి కావాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలన్న అంశాలపై సుప్రీంకోర్టు తీర్పునివ్వాలని కోరినట్టు తెలిపారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలయ్యేలా కేంద్రానికి, తెలంగాణకు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ వికాస కేంద్ర సహా మరికొందరు పిటిషనర్లు కోరారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement