న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌తో పాటు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటివారంలో చేపట్టనున్నట్టు వెల్లడించింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతోందని, నిందితులు తమ అధికారం, పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ట్రయల్ కోర్టు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి లేదా వేరే ఏదైనా రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపించింది.
తాజాగా జగన్‌కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ అప్పటికే దాఖలైన పిటిషన్‌కు బెయిల్ రద్దు పిటిషన్‌ను జతపరుస్తూ తదుపరి విచారణ జనవరి మొదటివారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అభయ్ ఓకా ప్రకటించారు. ఈ దశలో రఘురామకృష్ణ రాజు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ కేసులో తీవ్రతను పరిగణలోకి తీసుకుని త్వరగా విచారణ చేపట్టాలంటూ అభ్యర్థించారు.
అందుకే అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. కొంత అసహనానికి గురవుతూ “ఇప్పుడే బెయిల్ రద్దు చేయమని కోరుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. ప్రతివాదులకు నోటీసులైనా ఇవ్వమంటూ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేశారు.