Tuesday, November 26, 2024

Delhi | చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. 10న కూడా కొనసాగనున్న వాదనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్ 17(ఏ) నిర్వచనాలపై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం సెక్షన్ 17(ఏ)పై ఇచ్చే నిర్వచనాలు అవినీతి నిరోధక చట్టం మౌలిక ఉద్దేశానికి విఘాతం కల్గిస్తే అంగీకరించమని తెలిపింది. అవినీతిని అడ్డుకోవడమే చట్టం ఉద్దేశమని గుర్తుచేసింది.

సోమవారం భోజన విరామ సమయానికి చంద్రబాబు పిటిషన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. భోజన విరామం అనంతరం పూర్తిగా ఈ కేసుపైనే వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. సెక్షన్ 17(ఏ)ను చట్టంలో 2018 జులైలో చేర్చగా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక విచారణ జరిగిన సమయం, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తేదీలు అన్నీ కూడా 2021లోనే ఉన్నాయని సాల్వే తెలిపారు.

అయినప్పటికీ సీఐడీ సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోలేదని, అయితే హైకోర్టు నేరం జరిగిన సమయాన్ని పరిగణలోకి తీసుకుందని వెల్లడించారు. పార్లమెంటులో ఈ సెక్షన్‌ను చేర్చిన సమయంలో “ఇకపై ఈ సెక్షన్ వర్తిస్తుంది” అంటూ ఎక్కడా పేర్కొనలేదని, ఈ పరిస్థితుల్లో సెక్షన్ ప్రవేశపెట్టక ముందు జరిగిన నేరానికైనా ఇది వర్తింపజేయవచ్చని వాదించారు. ఈ సెక్షన్ తీసుకొచ్చిన ఉద్దేశమే రాజకీయ కక్షసాధింపులను నిరోధించడంతో పాటు ప్రజా సేవకులు స్వేచ్ఛగా పనిచేయడం కోసమని ఆయన సూత్రీకరించారు.

- Advertisement -

వాదనల సమయంలో ధర్మాసనం మధ్యమధ్యలో జోక్యం చేసుకుంటూ సెక్షన్ 17(ఏ)ను వర్తింపజేసే అంశంపై పలు సందేహాలు లేవనెత్తింది. అలాగే కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన సెక్షన్లకు మాత్రమే ఈ 17(ఏ) వర్తిస్తుందా? కేసులోని ఇతర చట్టాల ప్రకారం నమోదైన సెక్షన్ల విషయంలో దీన్నెలా వర్తింపజేస్తారు? అంటూ ప్రశ్నించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక ఉద్దేశం అవినీతిని అడ్డుకోవడం అని, ఈ పరిస్థితుల్లో సెక్షన్ 17(ఏ)కి ఇచ్చే నిర్వచనాలు ఆ మౌలిక ఉద్దేశానికి విఘాతం కల్గించేలా ఉంటే అంగీకరించమని తేల్చి చెప్పింది.

సెక్షన్ 17(ఏ) అమలులోకి రాకముందు నేరం జరిగి, తదనంతరం, ఇతర ప్రభుత్వ సేవకులను దర్యాప్తులో భాగంగా నిందితులుగా చేర్చినపక్షంలో ఇది వర్తిస్తుందా? అని ప్రశ్నిస్తూ.. ఇలాంటప్పుడు  జరిగిన నేరానికి దీన్ని వర్తింపజేయాలా వద్దా అన్నది చూడాలి తప్ప నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి వర్తిస్తుందా లేదా అని కాదు అంటూ వ్యాఖ్యానించింది. సెక్షన్ 17(ఏ)ను ఎలా వర్తింపజేయాలన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం 2021లో ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.ఓ.పీ) గురించి సాల్వే వివరిస్తుండగా.. మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ 2018లో ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినప్పుడు మూడేళ్ల కాలంలో దాన్ని ఎలా వర్తింపజేశారని ప్రశ్నించింది.

మధ్యాహ్నం కేసు విచారణ ప్రారంభించే సమయంలో “హైకోర్టులో మీ వాదనలు ముగిసిన తర్వాత సీఐడీ కొన్ని పత్రాలను కోర్టుకు సమర్పించినట్టయితే.. మీకు ఆ డాక్యుమెంట్లను కౌంటర్ చేసే అవకాశం దొరకనట్టయితే… కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా వెనక్కి (హైకోర్టుకు) తిప్పి పంపవచ్చా?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. నేరం జరిగిన సమయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నపుడు వెనక్కి పంపి ఉపయోగం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు అన్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడుకు ఈ సెక్షన్ వర్తిస్తుందని, ఆ ప్రకారం ఆయనపై నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదని వాదించారు.

చంద్రబాబు తరఫున వాదనలు జరుగుతుండగానే కోర్టు సమయం ముగియడంతో కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. ఉదయం గం. 10.30 నుంచే ఈ కేసు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. సీఐడీ (ఏపీ ప్రభుత్వం) తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీతో పాటు రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ.. సమయాభావం కారణంగా సోమవారం వారికి అవకాశం లభించలేదు. మంగళవారం సీఐడీ తరఫున రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement