Sunday, November 17, 2024

Delhi | నేడు సుప్రీంలో బాబు పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ ఎస్వీఎన్ భట్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ ను శనివారం న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు.

దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తీర్పులో పేర్కొంది. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకి వర్తించదని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

అయితే సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. నేటి విచారణలో ఇదే అంశంపై ప్రధానంగా వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాతో పాటు మరికొందరు సీనియర్ న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. బుధవారం నాటి విచారణలో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement