న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు ముందస్తు బెయిల్ పొందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (వైఎస్సార్సీపీ) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జూన్ 19కి వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టగా.. డా. సునీత తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినబోమంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్‌గా ఉన్న డా. సునీత నర్రెడ్డి తానే స్వయంగా వాదనలు వినపించారు. అయితే ఆమెకు వాదనల్లో సహకరించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు బెంచ్ అనుమతించింది.
వాదనల సందర్భంగా సునీత తన పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను వివరించే ప్రయత్నం చేయగా.. వెకేషన్ బెంచ్ విచారణ జరపాల్సింనంత అత్యవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని డా. సునీత చెప్పగా.. నిందితుడి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా లేదా.. విచారణకు సహకరిస్తున్నాడా లేదా అన్నది దర్యాప్తు సంస్థ (సీబీఐ) చూసుకోవాల్సిన వ్యవహారమని ధర్మాసనం చెప్పింది. అయితే సీబీఐకి తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని, ఆ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేయాలని డా. సునీత అభ్యర్థించారు.
సునీత వ్యక్తిగత పంతాలకు పోతున్నట్టుగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు సెలవుల అనంతరం జులై 3న రెగ్యులర్ బెంచ్ కేసు విచారణ చేపడుతుందని ధర్మాసనం చెప్పగా.. వివేక హత్యకేసు దర్యాప్తు ఈ నెల 30లోగా ముగించాలని సుప్రీంకోర్టే డెడ్‌లైన్ విధించిందని, అందుకే వెకేషన్ బెంచ్ పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలివ్వాలని కోరుతున్నామని డా. సునీత అన్నారు. గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు. సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, పిటిషనర్ కోరినందున తదుపరి విచారణ జులై 19కి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోగా అదనపు సమాచారం అందించేందుకు అనుమతించాలని డా. సునీత కోరగా.. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
పిటిషన్‌లో ఏముంది?
సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే క్రమంలో సీబీఐ సేకరించిన సాక్ష్యాలు సహా అనేక కీలకాంశాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్ధంగా అవినాశ్ రెడ్డికి హత్యకేసులో ముందస్తు బెయిల్ మంజూరైందని అన్నారు. అవినాశ్ సీబీఐ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. చివరగా మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు కూడా అవినాశ్ స్పందించలేదని అన్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యంతో ఉందనే కారణాలు చూపి హాస్పిటల్‌లో షెల్టర్ తీసుకున్నారని పేర్కొన్నారు.
సీబీఐ అరెస్టు చేయకుండా అవినాశ్ రెడ్డి ఆయన మద్దతుదారులు, గూండాలు అడ్డుపడ్డారని ఆరోపించారు. స్థానిక పోలీసుల సమక్షంలోనే అవినాశ్ రెడ్డి ఘటన స్థలంలోని ఆధారాలు చెరిపేశారని పేర్కొన్నారు. ఆధారాలు చెరిపేయటమే కాకుండా గుండెపోటుతో చనిపోయినట్లుగా కథను అల్లి ప్రచారం చేశారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా ప్రయత్నాలు చేశారని అన్నారు. సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకారంతో అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతుతో అదేపనిగా సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరిస్తున్నారని డా. సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా కేసులు నమోదు చేయించారని అన్నారు.
అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య బయట ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసని కూడా సీబీఐ పేర్కొందని డా. సునీత గుర్తుచేశారు. ఈనెల 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందని గుర్తుచేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ హైకోర్టు మినీ ట్రయల్ని నిర్వహించడమే కాకుండా అవినాశ్ రెడ్డి సహా ఇతర నిందితులు చేసిన వాదనలనే పరిగణలోకి తీసుకున్నట్లు కనబడుతోందని వెల్లడించారు. సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేస్తున్నారనే కారణంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించటం సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం కారణంగానే కేసు విచారణను హైకోర్టు తెలంగాణకు బదిలీ చేసిందని తెలిపారు. సీబీఐ విచారణను ఏపీ నుంచి బదిలీ చేయడంతో పాటు వివేక హత్య వెనక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని గుర్తుచేశారు. మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్‌లో డా. సునీత నర్రెడ్డి అభ్యర్థించారు.