Wednesday, November 20, 2024

ఒకేరోజు 230 కేసుల విచారణ.. సుప్రీంలో పెండిగ్‌ కేసుల విచారణ వేగవంతం

పెండింగ్‌ కేసుల విచారణను సుప్రీం ధర్మాసనం వేగవంతం చేస్తోంది. 12న (సోమవారం) మొత్తం 230 పిటిషన్లను విచారించనుంది. ఇందులో 206 వ్యాజ్యాలను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వస్తున్నాయి. ఇందులో 185 పిటిషన్లు పౌరసత్వచట్టాన్ని (సీఏఏ) సవాల్‌ చేస్తూ దాఖలైనవే. సీఏఏ వ్యాజ్యాలను మినహాయిస్తే, మిగతా వాటిలో సీనియర్‌ హోదా, గృహ సింహ చట్టంఅమలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపులు (నివారణ.. నిషేధం) చట్టం-2013 వంటి ఇతర ముఖ్యమైన కేసులు ఉన్నాయి. సుప్రీంలోని మరో 15 ఇతర బెంచ్‌లు 60కి పైగా కేసులను పరిశీలించనున్నాయి. 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసుల సత్వర విచారణకు జస్టిస్‌ యుయు లలిత్‌ హామీ ఇచ్చారు.

ఇందుకు అనుగుణంగానే సుప్రీం కోర్టు పనితీరును పునరుద్ధరిస్తున్నారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను జాబితా చేయడంపై ఆయన దృష్టిసారించారు. ప్రత్యేకించి ఒక్కసారి కూడా జాబితా చేయని కేసులను క్లియర్‌ చేయాలనే ఉద్దేశాన్ని ఇటీవలి విచారణల సందర్భంగా సీజేఐ స్పష్టంచేశారు. గత 15 నెలలుగా వెలుగు చూడని చాలా కేసులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఇటీవల సీజేఐ చెప్పారు. బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు కూడా 59 పిటిషన్లతో సహా మొత్తం 900 కేసులు సుప్రీంలోని 12 బెంచ్‌ల ముందు జాబితా చేయబడ్డాయి. కేవలం 74 రోజుల పదవీకాలం ఉన్నప్పటికీ, తక్కువ వ్యవధిలో వీలైనంత ఎక్కువ పనితీరుతో సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని చాటాలని సీజేఐ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement