Friday, November 22, 2024

HEALTH : పొంచి ఉన్న వ్యాధుల ముప్పు.. మాన్​సూన్​ సీజన్​లో జ్వరాల తాకిడి!

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి ) : వర్షాలు ప్రారంభమైనందునా రోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. మామూలు జ్వరమే కదా ఇబ్బందేమి లేదు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్లను సంప్రదించి నయం చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుషితమైన నీటిని తాగడం… పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవడంతో దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి. వాటి ద్వారా వైరల్‌ ఫీవర్లు వస్తున్నాయి. ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనుకుంటే రోగాలపాలు కావడం పక్కా. వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

పోయిన‌సారితో పోలిస్తే వ్యాధులు ఎక్కువే..
వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు అవుతుంది. అప్పుడే వైరల్‌ ఫీవర్లు ప్రారంభమయ్యాయి. జలుబుతో ప్రారంభమై జ్వరాలపాలవుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీవర్లు, డెంగ్యూ బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎక్కువగా వైరల్‌ ఫీవర్లు వస్తున్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌, నార్సింగి, బండ్లగూడజాగీర్‌ ప్రాంతాల్లో వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. మిగతా ప్రాంతాల్లో వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement