Friday, November 22, 2024

ఆరోగ్య భారతే లక్ష్యం, 10 ఏళ్లలో కొత్త వైద్యులు.. అందరికీ అందుబాటులో వైద్య విద్య: మోడీ

వైద్య విద్యను ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండేలా కృషి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని, ఆ దిశగా తాము ప్రయత్నాలు ముమ్మరం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గుజరాత్‌లోని భుజ్‌ జిల్లా కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. ఈ ఆస్పత్రికి జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్‌ కాలేజీని నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పుకొచ్చారు. రానున్న పదేళ్లలో భారీ సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని, దీంతో ఆరోగ్యవంతమైన భారత్‌ నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భుజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైద్య వ్యవస్థ ఎంతో బలోపేతం అయ్యిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ఆస్పత్రుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.

6వేలకు పెరిగిన సీట్లు..

రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం 1100 సీట్లతో 9 మెడికల్‌ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 6వేల సీట్లకు పెంచుకున్నామని మోడీ తెలిపారు. ఒక ఏయిమ్స్‌ ఆస్పత్రితో పాటు 36కంటే ఎక్కువ మెడికల్‌ కాలేజీలు గుజరాత్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. గడిచిన 20 ఏళ్లలో వైద్య విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 2001లో భూకంపం ద్వారా జరిగిన నష్టాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భుజ్‌, కచ్‌ ప్రజలు ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్నారన్నారు. ఈ ప్రాంతాలు ఇప్పుడు ఇంతలా ప్రగతి సాధించేందుకు కారణం స్థానికులే అని కొనియాడారు. భుజ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో వైద్యం మరింత చేరువైందని గుర్తు చేశారు.

200 పడకలతో ఆస్పత్రి..

కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కుచ్చి లేవా పటేల్‌ సమాజ్‌ నిర్మించిందని, కచ్‌లోని తొలి ఛారిటబుల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అని మోడీ తెలిపారు. 200 పడకలతో వైద్య సేవలు అందిస్తుందని, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అనేది కేవలం వ్యాధుల చికిత్సకు మాత్రమే పరిమితం కాదని.. సామాజిక న్యాయానికి కూడా పరిమితం అని మోడీ పేర్కొన్నారు. నిరుపేదలు తక్కువ ధరకు మెరుగైన వైద్య సేవలు అందినప్పుడే.. ఈ వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, రేడియేషన్‌ ఆంకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, న్యూరో సర్జరీ, జాయింట్‌ రీప్లేస్మెంట్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement