Monday, November 18, 2024

లేదు లేదన్నాడు, అమ్మేశాడు.. టెస్లా షేర్లు విక్రయించిన ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌… లేదు.. లేదు.. అంటూనే టెస్లా షేర్లను అమ్మేశారు. మాస్క్‌ టెస్లా కంపెనీకి చెందిన 7 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ విషయంలో రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిందని ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. టెస్లా సీఈఓగా ఉన్న ఎలాన్‌ మస్క్‌కు కంపెనీలు అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. గత శుక్రవారం నుంచి ఈ మంగళవారం వరకు ఆయన 7.9 మిలియన్ల షేర్లను విక్రయించారని తేలింది. ఇంత భారీగా షేర్లు విక్రయించడంతో ప్రస్తుతం కంపెనీలో ఆయన వాటా 15 శాతంగా ఉంది. సంవత్సరకాలంగా ఆయన టెస్లాలో తన షేర్లను విక్రయిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా 32 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు.

ట్విట్టర్‌ కొనుగోలు కోసం ఆయన ఏప్రిల్‌లో 8.5 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఒప్పందం నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ట్విట్టర్‌ కోర్టులో దావా వేసింది. కోర్టులో విచారణ త్వరలోనే జరగనుంది. ఈ విషయంలో కోర్టు ట్విట్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఎలాన్‌ మస్క్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇందు కోసం ఆయనకు 33 బిలియన్‌ డాలర్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ట్విట్టర్‌లో 9 శాతం వాటాలు ఉన్నాయి. ఒక్కో షేరును ఒప్పందం ప్రకారం 54.20 డాలర్లకు కొనుగోలు చేయాల్సి వస్తే, మస్క్‌ వాటా విలువ 4 బిలియన్‌ డాలర్లు. గతంలో టెస్లా షేర్లు విక్రయించిన సందర్భంగా ఒక నెటిజన్‌ షేర్లు అమ్మకం ఇక ముగిసినట్లేనా అని ప్రశ్నించగా ఆయన అవును అనే సమాధానం ఇచ్చారు.షేర్లు అమ్మబోమని చెప్పినప్పటికీ, తాజాగా భారీ ఎత్తున షేర్లను ఆయన విక్రయించారు.

ట్విట్టర్‌ను ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది రాకుడదనే షేర్లను విక్రయించినట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు తనతో కలిసి ఈక్విటీ భాగస్వాములు ముందుకు రాకుంటే.. అప్పుడు అత్యవసరంగా టెస్లా షేర్లు అమ్మాల్సి వస్తుంది. దీన్ని నివారించేందుకే ఆయన ముందు జాగ్రత్తగా షేర్లు విక్రయించారు. కోర్టు తీర్పు తనుకు అనుకూలంగా వస్తే తిరిగి టెస్లా షేర్లు కొనుగోలు చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement