నా క్రికెట్ ప్రయాణంలో ఎందాకైనా వెళ్తాను. ఎలాంటి సవాళ్లకైనా రెడీగా ఉంటాను. నాకు అవకాశం లభిస్తే నా ప్రతిభను నూరు శాతం ప్రదర్శిస్తాను. ఏ స్థానంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. టీమిండియా విజయానికి నా వంతు కృషిచేయడంలో ఎప్పుడూ ముందుంటానని చెప్పేందుకు గర్విస్తున్నాను.
యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌లో చిచ్చుబుడ్డిలా చెలరేగిన ఈ యువ సంచలనం, ఇప్పుడు టీమిండియాకు కొత్త కెరటంలా కనిపిస్తున్నాడు. డబ్ల్యుపిఎల్ ఫైనల్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఎంపికైన ఈ 21 ఏళ్ల యూపీ కుర్రాడు అనూహ్యంగా టెస్టు జట్టులో సభ్యుడయ్యాడు. జులై 12నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో విండీస్‌తో జరిగే తొలిటెస్టుకు సిద్ధమవుతున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం రావడం, అందునా ప్రపంచ మేటిజట్లలో ఒకటైన టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తంచేస్తున్నాడు.
మైదానంలో ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. జట్టు విజయానికి నూరు శాతం అంకితభావంతో కృషిచేస్తానని ధీమాగా చెబుతున్నాడు. కొన్నేళ్ల కిందట వాంఖడే ప్లడ్‌లైట్లను చూసి ఏదో ఒకరోజు ఇక్కడ ఆడాలి అనుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. ఇప్పుడు ఏకంగా భారత జట్టులో సభ్యుడినైనందుకు గర్వంగా ఉంది. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. డబ్ల్యుటీసీ ఫైనల్ సందర్భంగా సీనియర్లతో నెట్స్‌ను, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నా కెరీర్‌లో మరో ముందడుగు. రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటి గొప్ప ఆటగాళ్ల సాంగత్యం కలిగింది. నేనెప్పుడూ నిత్యవిద్యార్థిగానే ఉంటాను.
ఎప్పుడూ సీనియర్ల సలహాలు తీసుకుంటాను. డబ్ల్యుటిసి ఫైనల్ ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ఆ అనుభవం ఎప్పటికీ మరవలేను. ఇది నాకు ఆరంభం మాత్రమే. కొత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలుసు. నన్ను ఈ స్థాయికి చేర్చిన దేవుడికి, కోచ్‌కి, మా సీనియర్స్‌తోపాటు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నాపై విశ్వాసంతో టీమిండియాకు ఎంపిక చేసిన నాకొక అవకాశం ఇచ్చిన సెలక్టర్లకు చాలా చాలా కృతజ్ఞతలు. రోహిత్ భాయ్ ఆధ్వర్యంలో ఆడాను. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. రహానే కూడా ముంబై జట్టులోనే పరిచయం. మౌనంగా నా పని నేను చేసుకుపోవడాన్ని ఇష్టపడతాను.
విరాట్ భాయ్ క్రికెట్ లెజండ్. ఐపీఎల్ సందర్భంగా ఆయనతో చాలాసార్లు సంభాషించాను. చాలా విలువైన సూచనలు కూడా పొందాను. నెట్ సెషన్‌లో సీనియర్ల తో మాట్లాడడం ద్వారా వారినుంచి తెలియని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేశాను. రాహుల్ ద్రవిడ్ సర్ నుంచి ఫోన్ సందేశం అందుకున్నాను. టెస్టు జట్టుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. నా క్రికెట్ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతిదానికి నేను సిద్ధమే. ఎలాంటి సవాళ్లకైనా రెడీగా ఉంటాను. నాకు అవకాశం లభిస్తే నా ప్రతిభను నూరు శాతం ప్రదర్శిస్తాను. ఏ స్థానంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం అంటూ యశస్వి ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు.