దేశ కార్పొరేట్ చరిత్రలో మరో కీలక విలీనం జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలు అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ లిమిటెడ్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. దీనికి సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మధ్య విలీనంలో భాగంగా.. హెచ్‌డీఎఫ్‌సీలోని ప్రతీ 25 షేర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లు ఇస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 100 శాతం పబ్లిక్ షేర్ హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంటుంది.
ఈ విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నాటికి ఇరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే.. విలీన అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.8 లక్షల కోట్ల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ 50లో వెయిటేజీపరంగా చూసినా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అతిపెద్ద స్టాక్‌గా నిలవనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 31 నాటికి హెచ్డిdఎఫ్‌సీ బ్యాంకు వెయిటేజీ 8.4 శాతం ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ వెయిటేజీ 5.66 శాతంగా ఉంది.