ప్రైవేట్ సెక్టార్‌లోనే అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన హౌసింగ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హెచ్‌డీఎఫ్‌సీ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఫలితాలను శనివారం మధ్యాహ్నం వెల్లడించింది. అయితే అంచనాలకు మించి బ్యాంకు ఫలితాలు రికార్డయ్యాయి. బ్యాంకులకు సంబంధించిన నికర లాభాలు భారీగా పెరిగాయి. జనవరి-మార్చికి సంబంధించిన నికర లాభాలు ఏకంగా 23 శాతం నమోదు చేసుకున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన క్యు4 ఫలితాల రెగ్యులేటరీ ఫైలింగ్ నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో 22.8 శాతం మేర ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో, చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 22.8 శాతం మేర నెట్ ప్రాఫిట్ రికార్డు చేసింది.
మెరుగుపడిన ప్రాఫిట్..
2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికం జనవరి-ఫిబ్రవరి-మార్చి మధ్య కాలానికి రూ.10,055.2 కోట్ల నికర లాభాలను తన ఖాతాలో వేసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన నాల్గో త్రైమాసికంతో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ భారీగా మెరుగుపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ.8,186.50 కోట్ల మేర నెట్ ప్రాఫిట్‌ను రికార్డు చేసింది. ఈ ఏడాది అదే కాలానికి రూ.10,055.2 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను అందుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 11 శాతం (రూ.3,261 కోట్లు) నికర లాభాన్ని పొందగా.. నాల్గో త్రైమాసికానికి వచ్చే సరికి రెట్టింపు అయ్యింది. పన్ను రూపంలో రూ.2,989.50 కోట్లు చెల్లించినట్టు ప్రకటించింది.
6శాతం పెరిగిన నికర లాభం..
గత ఆర్థిక సంవత్సరం (2021-2022) మొత్తానికి సంబంధించిన నికర ఆదాయం అంటే.. నాలుగు త్రైమాసికాలు కలిపి చూసుకుంటే.. రూ.41.085.78 కోట్లుగా ఉండింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.38,017.50 కోట్లుగా రికార్డయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22లో నికర ఆదాయం సుమారు 6 శాతం అధిక నికర లాభాలను హెచ్‌డీఎఫ్‌సీ పొందింది. చివరి త్రైమాసికమైన క్యు4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. 10.2 శాతంతో రూ.18,872.70 కోట్లను నమోదు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.17,120.20 కోట్లుగా రికార్డయ్యింది. బ్యాంకు ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తానికి, డిపాజిటర్లకు బ్యాంకు చెల్లించే వడ్డీ వ్యత్యాసం ద్వారా వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఆదాయంగా పేర్కొంటారు. నికర రెవెన్యూ, నికర వడ్డీ ఆదాయం వంటికి కలుపుకుంటే.. మొత్తంగా రూ.25,509.80 కోట్ల మేర ఆదాయాన్ని అందుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన నివేదికలో ప్రకటించింది.
క్యు4లో కొత్తగా 563 బ్రాంచీలు..
బ్యాంకు ఆధీనంలో ఉన్న నిరర్ధక ఆస్తుల విలువ 1.17 శాతంగా నమోదైంది. మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఇది కాస్త తక్కువే. 1.26 శాతం నుంచి 1.17 శాతానికి తగ్గింది. నికర నిరర్ధక ఆస్తులు 0.40 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గినట్టు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ చెల్లింపులు, రాబడి మధ్య తేడా పెరిగింది. ఈ చివరి త్రైమాసికంలోనే దేశ వ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలను నెలకొల్పినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. ఫలితంగా 7,167 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 734 బ్రాంచీలు ఏర్పాటు చేసినట్టు నివేదికలో వెల్లడించింది. 21,486 మందిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రిక్రూట్ చేసుకున్నట్టు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..