Tuesday, November 26, 2024

మళ్లీ తెరపైకి హెచ్‌సీఏ రగడ.. క్రీడా సామగ్రి కొనుగోలులో అవకతవకలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హైచ్‌ సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రధానంగా ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ పనితీరు, వివాదాస్పద వ్యవహారశైలి మరోమారు చర్చనీయాంశమైంది. నియమ నిబంధనలు పక్కనపెట్టి, క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు. క్రీడాకారుల ఎంపిక విషయంలోనూ అసంబద్ధ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రతిభతో సంబంధం లేకుండా పైరవీకారులకు జట్లలో స్థానం కల్పించారని హెచ్‌సీఏ సభ్యులు, సీనియర్‌ క్లబ్‌ సెక్రటరీలు ధ్వజమెత్తారు. అజార్‌ వ్యవహారశైలితో యువ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యక్షుడి అనాలోచితనమైన నిర్ణయాల వల్ల క్రికెటర్లపై పెను ప్రభావంపడుతోందని విమర్శలు గుప్పించారు. సోమవారం ఫతే మైదాన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత జట్టు మాజీ క్రికెటర్లు అర్షద్‌ ఆయూబ్‌, శివ్‌లాల్‌ యాదవ్‌, హైచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష్‌నారాయణ్‌ మాట్లాడారు. హచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, సంయుక్త కార్యదర్శి నరేష్‌ శర్మ, మాజీ కోశాధికారి దేవ్‌రాజ్‌, మాజీ ఈసీ మెంబర్‌ చిట్టి శ్రీధర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్షద్‌ ఆయూబ్‌ మాట్లాడుతూ హెచ్‌సీఏను అజారుద్దీన భ్రష్ఠు పట్టించాడని, కాసుల కక్కుర్తితో ప్రతిభకు పాతరేస్తున్నాడని ఘాటైన విమర్శలు చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌, ఏజీఎం, హెచ్‌సీఏ రాజ్యాంగం దేనితోనూ సంబంధం లేకుండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ‘అజర్‌ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్న వారిని, అతడు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల గురించి నిలదీస్తున్న వారిపై కక్షపూరిత చర్యలకు దిగుతున్నాడు. ఆ క్లబ్‌లను హెసీఏ లీగ్‌ల్లో ఆడకుండా నిరోధించడం. క్లబ్‌లను గుర్తింపు రద్దు చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు’ అని ఆరోపించారు. ప్రతిభ గల క్రికెటర్లకు అన్యాయం జరుగుతున్నా.. హెచ్‌సీఏ పాలన వ్యవహారాలు గాడి తప్పుతున్నా ఎవరు నొరెత్త కూడదు, ప్రశ్నించకూడదన్నట్టు అజారుద్దీన్‌ ప్రవర్తిస్తున్నాడని శివ్‌లాల్‌ మండిపడ్డారు. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులకు లెక్కా పత్రం లేకుండా పోయిందని.. మూడేళ్లగా ఆడిట్‌ రిపోర్టును దాచి పెడుతున్నారని విమర్శించారు. ”గత మూడేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ కానీ, ఐపీఎల్‌, రంజీ, ముస్తాక్‌ అలీ మ్యాచ్‌లకు కానీ ఆతిథ్యం ఇవ్వలేకపోవడానికి కారకులెవరో అజారుద్దీన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వ్యాపారంగా మారిపోయింది..
అజారుద్దీన్‌ అధ్యక్షుడయ్యాక హెచ్‌సీఏలో జవాబుదారీతనం పోయి నియంతృత్వం వచ్చిందని శేష్‌నారాయణ్‌ విమర్శించారు. అసోసియేషన్‌ అవినీతి, అక్రమాల కూపంగా మారిపోయిందని ఆరోపణలు గుప్పించారు. ”అధునాతున జిమ్‌ ఏర్పాటు చేస్తామని రూ.2.11 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క డంబుల్‌ కూడా రాలేదు. గడిచిన మూడేళ్లలో కోట్ల రూపాయలు మాయం చేశారు. ఇటీవల బీసీసీఐ నుంచి వచ్చిన రూ.16 కోట్లను కూడా పక్కదారి పట్టించారు. బంతులు, క్రికెటర్ల జెర్సీలు, ట్రాక్స్‌, క్రికెట్‌ సామగ్రి కొనుగోలులో అవకతవకలకైతే హద్దే లేకుండా పోయింది” అని ఆరోపించారు. రంజీ, ముస్తాక్‌ అలీ మొదలు బీసీసీఐ ఏ టోర్నమెంట్‌ నిర్వహంచినా నిబంధనలకు విరుద్ధంగా జెంబో బృందాలను పంపుతున్నారు. సెంచరీలు కొట్టకపోయినా, వికెట్లు తీయకపోయినా డబ్బులుంటే చాలు జట్టులో చోటు ఖాయమనేలా హెచ్‌సీఏను దిగజార్చారని విమర్శించారు. ప్రసుత్త కార్యవర్గం గడువు మరో నెల రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వ#హంచేలా సుప్రీం కోర్టు, బీసీసీఐకి విన్నవించనున్నామని శేష్‌నారాయణ్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement