న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వారి డిమాండ్ల సాధన కోసం నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఆయుధం లేకుండా పోరాడుతున్న తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయుధమిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘాల ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ సంఘాల ధర్నాకు హాజరై మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు చట్ట సభల్లో కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని, ఇప్పుడు చట్టసభలో ఉండి పోరాడే అవకాశం దొరికిందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ.. రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వాలన్న ఆలోచనను కార్యరూపంలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తన శక్తి మేరకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. క్రీమీలేయర్ విధానం కారణంగా బీసీలకు జరుగుతున్న నష్టంపై పోరాడతానని తెలిపారు. అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
చట్టసభల్లో 50% రిజర్వేషన్లు వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి..
చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వాలని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. న్యాయబద్ధ వాటా దక్కకుండా ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లలో కోతలు పెడుతున్నారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, నీల వెంకటేశ్, కృష్ణుడు, కోలా జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.