Monday, November 18, 2024

విమోచన దినం ఇప్పుడే గుర్తొచ్చిందా? బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై వీహెచ్ ధ్వజం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మునుగోడు ఉపఎన్నికల్లో లాభపడేందుకే బీజేపీ విమోచన దినోత్సవం నిర్వహిస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. శనివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీకి విమోచన దినం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య సంబంధాలు బాగున్నప్పుడు విమోచన దినాన్ని నిర్వహించాలనిపించలేదా అని వీహెచ్ నిలదీశారు. సర్దార్ పటేల్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టి కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలు చేస్తున్నారన్న వీహెచ్, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. సెప్టెంబర్ 17న బీజేపీ-టీఆర్‌ఎస్‌లు చేసేవి పెద్ద నాటకంలో భాగమేనని ఆరోపించారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ కొత్త డ్రామాలకు తెరలేపిందని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో ధరలను పెంచడం తప్ప నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా అని వి.హనుమంతరావు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement