Friday, November 22, 2024

Hathras – వైట్ సూట్‌.. క‌ళ్ల‌కు అద్దాలు – ఈ భోలే బాబా స్టైలే వేరు

ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్‌
స‌త్సంగ్ పేరుతో కార్య‌క్ర‌మాలు
దేవుడి ధూత‌గా చెప్పుకుంటున్న బాబా

యూపీలోని హాథ్రాస్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 121 మంది మృతిచెందారు. భోలే బాబా నిర్వ‌హించిన స‌త్సంగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. బాబా అస‌లు పేరు నారాయ‌ణ్ సాకార్ హ‌రి. తనను తాను దేవుడికి శిష్యుడిగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. తొక్కిస‌లాట‌లో మృతిచెందిన వారంతా ఈయ‌న భ‌క్తులే. నారాయ‌ణ్ హ‌రి స్వస్థలం యూపీలోని ఈటా జిల్లాలో బహదూర్‌ గ్రామం. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో పనిచేసిన‌ట్లు ఆయ‌నే చెప్పుకున్నారు. ఆధ్యాత్మిక జీవితం కోసం 26 ఏండ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశానని చెబుతుంటాడు. ఆయన అనుచరులు అలీగఢ్‌లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ నిర్వహిస్తుంటారు. కాషాయ వస్త్రాలు ధరించకుండా, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం ఈయన స్టైల్‌గా చెప్పుకోవ‌చ్చు.

- Advertisement -

ఉత్త‌రాది రాష్ట్రాల్లో య‌మ క్రేజ్‌..

ఖరీదైన అద్దాలు, తెల్లని సూట్‌, టై ధరించి ఈయన నిర్వహించే ‘సత్సంగ్‌’ కార్యక్రమాలకు పశ్చిమ యూపీలో భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. భోలే బాబాను సూర‌జ్ పాల్ సింగ్ అని కూడా కొంద‌రు భ‌క్తులు పిలుస్తుంటారు. యూపీ పోలీసు శాఖ‌లో హెడ్ కానిస్టేబుల్‌గా చేశాడు. ఆ శాఖ‌తో అనుసంధాన‌మైన‌ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో సుమారు 18 ఏళ్లు ప‌నిచేసిన‌ట్లు చెప్పుకుంటాడు. 1999లో స్వ‌చ్ఛంధ ప‌ద‌వీవిర‌మ‌ణ తీసుకున్నాడు. సూర‌జ్ పాల్ సింగ్ ణుంచి నారాయ‌ణ్ సాకార్ హ‌రిగా అత‌ని పేరు మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత స‌త్సంగ్‌లు నిర్వ‌హించ‌డం మొద‌లుపెట్టాడు. ఆధ్యాత్మిక‌త‌, ప్ర‌పంచ శాంతి దిశ‌గా త‌న మ‌న‌సు మారిన‌ట్లు ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెప్పేవాడు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యంతోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖ‌లు

హాథ్రస్‌ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆ పిటిషన్​లో పేర్కొన్నారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement