Thursday, November 21, 2024

Delhi | హస్తినలో రేవంత్.. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. 100 రోజుల పాలన, హామీల అమలుపై హైకమాండ్‌కు రేవంత్ వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ బలోపేతం, నేతల చేరికలపై సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థుల ఎంపికపై చర్చలు..

అదేవిధంగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంపై అధిష్టానంతో రేవంత్‌ చర్చలు జరుపుతున్నారు. కాగా, రేపు లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో.. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే మేనిఫెస్టో ముసాయిదా ఖరారుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రెండు సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.

ఈ సమావేశంలో తెలంగాణలోని 13 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయనుంది. కాంగ్రెస్ తొలి జాబితాలో ఇప్పటి వరకు 4 లోక్‌సభ స్థానాలకు (మహబూబ్‌నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ) అభ్యర్థులను ప్రకటించింది. ఇక వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, పెద్దపల్లి, భువనగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా పెండింగ్‌లో ఉంది.

ఈ స్థానాలకు సంబంధించి ఆశావహులు ఎవరు? అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? వంటి అంశాలన్నింటిపై సోనియా, రాహుల్ గాంధీలతో రేవంత్ చర్చిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఎన్నికల ప్రచార అంశంపై కూడా చర్చించనున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సోనియా, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement