Saturday, November 23, 2024

వరికోతలు స్పీడ‌ప్‌.. ఏ గ్రామంలో చూసినా హార్వెస్టర్ల సందడే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమయ్యాయి. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పొటెత్తుతోంది. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలన్నీ ధాన్యం రాశులతో నిండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 35లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగయింది. దాదాపు 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వారం రోజులుగా వరి కోతలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరిచేలు కోతలకు వచ్చాయి. దీంతో ఏ గ్రామంలో చూసినా రైతుల పొలాల్లో హార్వెస్టర్లు సందడి చేస్తున్నాయి. ప్రతి రోజూ పెద్ద ఎత్తున కోసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50శాతం వరికోతలు పూర్తయినట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మే మూడో వారం దాకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ముమ్మరంగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల సంఖ్యను రోజు రోజుకూ పెంచుతున్నారు.

ఈ యాసంగిలో మొత్తం 6920 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. నాలుగైదు రోజులుగా ధాన్యం రాక ఎక్కువవడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి. 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా… అందులో 2.85లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని ఇప్పటికే మిల్లులకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. ధాన్యం తూకం అయిన తర్వాత ధాన్యం రవాణాలోగాని, మిల్లర్లతో గాని రైతులకు ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోళ్లను నిర్వహిస్తున్నారు. ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే డబ్బులను జమచేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆ శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఈ వారంతానికి 80శాతం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement