హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రచంఢ భానుడి ధాటికి వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండలు దంచి కొడుతుండడంతో మధ్యాహ్నం జనసంచారం లేక ప్రధాన కూడళ్లు, రహదారులు బోసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 దాటితే చాటు ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాయివ్య భారతం నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటాయి. రికార్డుస్థాయిని మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండం ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీలు, భద్రాచలంలో 43.4, హకీంపేటలో 38.1డిగ్రీలు, దుండికల్‌లో 39.9 డిగ్రీలు, హన్మకొండలో 41.5 , హైదరాబాద్‌లో 39.7 డిగ్రీలు, ఖమ్మంలో 42.8, మహబూబ్‌నగర్‌లో 39.7, మెదక్‌లో 42.3, నల్గొండలో 43.4 నిజామాబాద్‌లో 41.9, రామగుండంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న మూడు రోజులు ఎండలే ఎండలు…
వేసవి ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయిలో నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఆరుబయట తిరగొద్దని ప్రజలను హెచ్చరించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. దిగువస్థాయిలోని గాలులు వాయివ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం నుంచి హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్‌ఓ పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.