ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూర్ పలు వ్యక్తిగత రికార్డులు నమోదుచేశాడు. ఇంగ్లండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ బాదిన ఆరో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. అతని కంటే ముందు లియోనార్డ్ హట్టన్ (364), వాలీ హమ్మండ్ (336), గ్రాహమ్ గూచ్ (333), ఆండీ సాందమ్ (325), జాన్ ఎడ్రిచ్ (310) ఈ ఘనత అందుకున్నారు.
ఇక బంతుల పరంగా ట్రిపుల్ సెంచరీ అత్యంత వేగంగా సాధించిన రెండో ప్లేయర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. 310 బంతుల్లో బ్రూక్ 300 మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో టాప్-4లో రెండు స్థానాల్లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 2008లో సౌతాఫ్రికాపై సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. మూడో స్థానంలో మాథ్యూ హేడెన్ (362 బంతుల్లో, జింబాబ్వేపై-2003), నాలుగో స్థానంలో సెహ్వాగ్ (364 బంతుల్లో, పాకిస్థాన్‌పై- 2004) ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో జో రూట్ తో కలిసి…. బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 454 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన నాలుగో జోడీగా చరిత్రకెక్కారు.
ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన.. కుమార సంగక్కర-మహేలా జయవర్ధనె (624 పరుగుల భాగస్వామ్యం, సౌతాఫ్రికాపై-2006), జయసూర్య-మహనామా (576 పరుగుల భాగస్వామ్యం, భారత్‌పై-1997) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ క్రోవ్-ఆండ్రూ జోన్స్ (467 పరుగుల భాగస్వామ్యం, శ్రీలంకపై-1999) ఉన్నారు.