Saturday, November 16, 2024

హరిత హారం.. లక్ష్యాన్ని మించిన ఫలితం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఈ ఏడాది లక్ష్యాన్ని మించి ఫలితాన్ని సాధించింది. 2015లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ళల్లో మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాల‌ని లక్ష్యం పెట్టుకోగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 239 కోట్ల మొక్కలను నాటింది. 2015 నుంచి 2021 వరకు ఏడు విడతలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కోసం రూ.7,240 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రం అటవీ విస్తీర్ణం 67 లక్షల ఎకరాలు (24 శాతం) ఉంది. దీన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ ఏటా నిర్వహిస్తోంది. 2015 నుంచి 2019 వరకు ఆరు విడతల్లో మొత్తం 217 కోట్ల మొక్కలు నాటగా, ఈ ఏడాది వర్షాకాలంలో నాటికి 239 కోట్ల మొక్కులు నాటినట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి.

హరితహారం మొక్కల కోసం ప్రతి పంచాయతీలో నర్సీలను ఏర్పాటు చేసింది. ప్రతి శుక్రవారం గ్రీన్‌ ఫ్రైడే పాటిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే విధంగా హరితనిధిని ఏర్పాటు చేసింది. హరతనిధికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది.

వచ్చే ఏడాది చేపట్టే 8వ విడత హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలను పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో పనులను ముమ్మరం చేశారు. ఏ గ్రామపంచాయతీలో ఎన్ని మొక్కలను పెంచాలనే నిర్ధేశిత లక్ష్యాన్ని ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఇప్పటికే నర్సరీ నిర్వహకులు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో నర్సరీలో కనీసం 25 వేల నుంచి 30 వేల వరకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అధికంగా నీడనిచ్చేవి, పండ్ల‌ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నర్సరీలలో మొక్కల పెంపకానికి ఉపాధి హామీ కూలీలను వాడుకుంటున్నారు. ఒకొక్క నర్సరీల్లో ప్రతి రోజు ఐదు నుంచి పది మంది వరకు ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్నారు. వారికి రోజుకు రూ.245 చొప్పున కూలీ చెల్లిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement