నిర్మల్ ప్రతినిధి, జూన్ 8 (ప్రభ న్యూస్) : సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు విశేష కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి -బి సమీపంలోని గండిరామన్న హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారీని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా 5 కిలోమీటర్లు నడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నామన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల సంరక్షణ చర్యల వల్ల వన్య ప్రాణుల సంఖ్య పెరగిందని, మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ కు పులులు వలస వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణ హిత టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గండిరామన్న హరితవనంలో సందర్శించే వారికి సరికొత్త అనుభూతిని కల్పించేందుకు రెండు ప్రత్యేక ఓపెన్‌టాప్ సఫారీ వాహనాలతో పాటు పెట్రోలింగ్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి కోసం రూ. 39 లక్షల వెచ్చించామని తెలిపారు. అర్బన్ పార్కులో జంగల్ సఫారీని నిర్వహించడం అద్భుతంగా ఉందని కొనియాడారు. పార్కులో అడ్వెంచర్ కార్యక్రమాలతో పాటు పిల్లలు, పెద్దలందరికీ ఆహ్లాదం, వినోదం కలిగించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హరితవనంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్కు, చైన్ లింక్, ఎకో హట్స్, సైక్లింగ్, వాచ్ టవర్స్ చిన్న పిల్లల ఆట స్థలం లాంటి సౌకర్యాలను సందర్శకుల కోసం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న హరితోత్సవ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (HoFF) ఆర్.ఎం.డొబ్రియల్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వణన్, జిల్లా అటవీ అధికారి హిరామత్, తదితరులు పాల్గొన్నారు.