Wednesday, September 18, 2024

TG | సహాయక చర్యల్లో భాగం కండి.. బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్ధిపేట నియోజకవర్గ నాయకులతో హరీష్‌రావు టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా చెక్‌ డ్యామ్‌లు, చెరువుల పరిస్థితి ఆరా తీశారు. శిథిలావస్థలో ఉన్న నివాసంలో ఉంటున్న వారిని తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. వర్షాలకు నష్టం పోయిన వారికి నష్ట పరిహారం అందించే విధంగా చొరవ చూపాలన్నారు.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రావద్దని సూచించారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే హరీష్‌ రావు సూచించారు.

సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు

నల్గొండ జిల్లా దేవరకొండలో భారాస నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

”అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్‌లు తెప్పించాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు కాలువలు తెగకుండా ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు సెలవులు రద్దుచేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.

ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో, చెరువులు, కాలువలు వద్దకు ఎవరు వెళ్ళవద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement