Friday, November 22, 2024

ఇక మైనార్టీల‌కూ ల‌క్ష సాయం – శుభ‌వార్త చెప్పిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని మైనార్టీల‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శుభ‌వార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీల‌కు ప్ర‌భుత్వం రూ. ల‌క్ష ఆర్థిక సాయం అంద‌జేస్తుంద‌ని మంత్రి ప్ర‌క‌టించారు. బ్యాంకుల‌తో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌లు మైనార్టీ కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్లుగా నియ‌మితులైన వారిని మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ స‌న్మానించారు. జ‌ల‌విహార్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ష‌కీల్, దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ ఫ‌రూక్ హుస్సేన్, ప‌లు మైనార్టీ కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. హిందూవుల‌కు క‌ల్యాణ‌లక్ష్మి అమ‌లు చేసిన‌ట్లు.. మైనార్టీల కోసం షాదీ ముబార‌క్ అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. మైనార్టీల కోసం రూ. ల‌క్ష ఆర్థిక సాయం ప‌థ‌కాన్ని త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామ‌న్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఒకట్రెండు రోజుల్లో వ‌స్తుంద‌న్నారు.
దేశంలో ఇప్ప‌టికీ ముస్లింలు పేద‌వారిగానే ఉన్నారు.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాల‌న వ‌ల్లే అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో రూ. 2,200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామ‌న్నారు. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేశారు.
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వ‌హించాల‌ని అడిగిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రే అని తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement