Wednesday, December 4, 2024

Harish Rao – కాంగ్రెస్ పాలనలో ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా ..

హైదరాబాద్ – ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని,. ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. .

ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని.. మాది సుపరిపాలన అంటూ డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు.. ఈ మేరకు ఒక లేఖ ఆయన నేడు విడుదల చేసారు.

నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలని.. నువ్వు కాదు రేవంత్ రెడ్డి అన్నారు. నీ అపరిపక్వత నీ అసమర్థత, నీ ప్రతికూల వైఖరితో రాష్ట్రంలో నేడు అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదన్నారు. వృద్ధిరేటు పెంచే సత్తా లేదు.. సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నావంటూ మండిపడ్డారు.

- Advertisement -

నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నావని.. ఆడరాక మద్దెల ఓడు అనే సామెతకు నీ మాటల్ని మించిన నిదర్శనం లేదంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదని.. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ధి, ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవితలా ఉందన్నారు. రూ.7లక్షలకోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెబుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటారని.. గోబెల్స్‌ని మించిన రేబెల్స్ ప్రచారం నీది అంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం దాచిందని అసత్య ప్రచారం చేస్తున్నావని.. ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉండదు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

అప్పులు బహిరంగ రహస్యమేనని.. గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయన్నారు. ప్రతీ ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయన్నారు. ఆ నాడు సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పులు ఎంతో, ఆదాయం ఎంతో తెలియదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు రూ.4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా నిరూపించానన్నారు. ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్నానన్నారు. నా వాదనలో సత్యం ఉందని.. సత్యాన్ని ఎదుర్కునే శక్తి నీకు లేదని.. ఆర్థిక మంత్రికి లేదన్నారు.

తోచిన అబద్ధమల్లా చెప్పి ప్రజల్ని తొవ్వ తప్పిద్దామనే తొండి బుద్ధి మీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఛానల్ వేదికగా కూర్చుందామని.. ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో చెప్పు.. తప్పించుకోవద్దన్నారు. నీపేరే ఎగవేతల రేవంత్ రెడ్డి అని.. రైతుబంధును ఎవరు ఎగ్గొట్టారో ప్రజలకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రజల విజ్నత మీద నీకు చాలా తక్కువ అభిప్రాయం ఉందన్నారు. మోసం చేసుడు నీకలవాటు, మోస పోవుడు ప్రజలకు అలవాటు అనే కదా నీ నమ్మకం అంటూ తీవ్రంగా స్పందించారు.

గత ఎన్నికలకు ముందు రైతుబంధు కోసం 7,200 కోట్ల నిధులు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నామని.. తెల్లవారితే ఖాతాల్లో వేస్తామని తొర్రూరు సభలో స్వయంగా నేనే ప్రకటించానన్నారు. రైతుబంధు ఖాతాల్లో పడితే నీకు ఓట్లు డబ్బాలో పడవని భయమై, దుర్మార్గంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఆపింది నువ్వేనన్నారు. నోటికి కాడికి వచ్చిన బుక్కను ఎగ్గొట్టిన పాపాత్ముడివి నువ్వు అంటూ మండిపడ్డారు.

ఇప్పుడైతే రూ.10వేలు, మేమొస్తే రూ.15వేలు అని రైతులను ఊరించి, నమ్మించి ఓట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడివి నువ్వు అంటూ ఘాటుగా స్పందించారు.పార్లమెంట్ ఎన్నికల ముందు మేము నిలదీస్తే విధిలేక మేము సిద్ధం చేసిన నిధులతో రైతుల ఖాతాల్లో 5వేలే వేశామని.. 7500 ఎందుకు వేయలేదంటూ నిలదీశారు. నిజాయతీ ఉంటే సమాధానం చెప్పాలనన్నారు.

మొన్న వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టినవని.. రైతుబంధును ఆపింది నువ్వు, లేని ఆశలు రేపింది నువ్వు, తీరా అధికారంలోకి వచ్చి ఎగవేసింది నువ్వు.. ఎగ్గొట్టింది మేమా నువ్వా? అంటూ ఫైర్‌ అయ్యారు. అబద్దానికి అంగీ లాగు వేస్తే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. వరుసగా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర పరిస్థితి అతలాకుతలం అయిపోయినా కేసీఆర్ రైతు బంధును ఆపలేదని గుర్తు చేశారు.

మా హయాంలో మొత్తం 11 విడతల్లో రూ.72,815 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. ఆరు నూరైనా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా? ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడ ? కేసీఆర్ పేరు ఉచ్చరించే నైతికత కూడా నీకు లేదన్నారు.నీకు దమ్ముంటే, రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే.. నీది నిజమైన ప్రజాపాలనే అయితే సంపూర్ణ రుణమాఫీతో పాటు, వరంగల్ డిక్లరేషన్‌ తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు.

అప్పుడు చెయ్యి రైతు పండుగను.. అప్పుడు నీ పరిపాలన విజయోత్సవాలు చేయి అంటూ హితవు పలికారు. • పైన పటారం లోన లొటారం, నీ పాలనంత డంబాచారం.. ఆ డంబాచారంలో భాగమే రైతు పండుగ, విజయోత్సవాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం.. నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్ రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement